Share News

ఆసియా క్రీడలు: షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం.. తజిందర్ పాల్ రికార్డు

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:04 PM

భారత స్టార్ షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ ఆసియా క్రీడల్లో మరో పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫైనల్‌లో 20.64 మీటర్ల అత్యుత్తమ త్రో వేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఆసియా క్రీడలు: షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం.. తజిందర్ పాల్ రికార్డు
Tajinderpal Singh Toor

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఆసియా క్రీడల్లో మరో పతకం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫైనల్‌లో 20.64 మీటర్ల అత్యుత్తమ త్రో వేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి పతకం అందుకుని రికార్డు నెలకొల్పాడు. అయితే 2018 జకార్తా, 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తజిందర్.. ఈసారి మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.


ఫైనల్లో తజిందర్ తొలి ప్రయత్నంలో 20.06 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత 20.26 మీటర్లు, 19.77 మీటర్లు, 19.71 మీటర్లతో వరుసగా ప్రయత్నాలు చేశాడు. ఐదో ప్రయత్నంలో ఏకంగా 20.64 మీటర్లు విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆరో ప్రయత్నంలో ఫౌల్‌ కావడంతో మరోసారి మెరుగైన త్రో నమోదు చేయలేకపోయాడు. ఇరాన్‌కు చెందిన మహ్మద్‌ రెజా తైబీసే 20.81 మీటర్ల త్రోతో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. రెండో ప్రయత్నంలోనే ఈ దూరాన్ని నమోదు చేసిన అతడు ఆసియా క్రీడల రికార్డును కూడా బద్దలు కొట్టాడు.


అయితే ఆ రికార్డు భారత అథ్లెట్ తజిందర్ సింగ్ పేరిటే ఉండటం గమనార్హం. 2018 ఆసియా క్రీడల్లో అతడు 20.75 మీటర్ల దూరం విసిరి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు 20.81 మీటర్ల త్రోతో తైబీసే ఆ రికార్డును అధిగమించాడు. సౌదీ అరేబియాకు చెందిన మహ్మద్‌ టోలు 20.48 మీటర్ల అత్యుత్తమ త్రోతో కాంస్య పతకాన్ని సాధించాడు.


త్రుటిలో చేజారిన స్వర్ణం..

వరుసగా రెండుసార్లు స్వర్ణం సాధించి.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన తజిందర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కూడా స్వర్ణ పతకం సాధించి ఉంటే అథ్లెటిక్స్‌లో వరుసగా మూడు ఆసియా క్రీడల పసిడి పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా తజిందర్ చరిత్ర సృష్టించేవాడు. రజతం దక్కడంతో ఆ ఘనతకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: డబుల్ బొనాంజా.. కబడ్డీలో భారత్‌కు మరో స్వర్ణం

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

Updated Date - Sep 26 , 2026 | 06:04 PM