ఆసియా క్రీడలు: 400 మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం
ABN , Publish Date - Sep 26 , 2026 | 08:47 PM
ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల ఫైనల్లో 53.21 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల ఫైనల్లో 53.21 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో ప్రాచికి ఇదే తొలి పతకం కావడం విశేషం. బహ్రెయిన్ స్టార్ అథ్లెట్ సల్వా నాజర్ 49.20 సెకన్లతో స్వర్ణ పతకం సాధించగా.. ఇరాన్‌కు చెందిన జహ్రా జరీ మనూజన్ 52.38 సెకన్లతో రజతం గెలుచుకుంది. పతకం సాధించిన అనంతరం ప్రాచీ.. స్వర్ణ పతక విజేత, ఒలింపిక్ రజత పతక విజేత సల్వా నాజర్‌తో కలిసి ఫొటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రాచీ తొలి హీట్‌లో 53.46 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ దక్కకపోయినా.. అత్యంత వేగంగా రేసు పూర్తి చేసిన అథ్లెట్లలో ఒకరిగా ఫైనల్‌కు అర్హత సాధించింది. కొన్ని గంటల తర్వాత జరిగిన ఫైనల్లో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని 53.21 సెకన్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరో భారత అథ్లెట్ కిరణ్ పహల్ 53.41 సెకన్లలో రేసును పూర్తి చేసి ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా, ప్రాచీ మహిళల 4x400 మీటర్ల రిలేలోనూ బరిలోకి దిగాల్సి ఉంది. గత ఆసియా క్రీడల్లో రజతం సాధించిన ప్రాచీ.. ఈసారి గోల్డ్‌పై కన్నేసింది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు