Share News

ఖతార్‌లో కలుద్దాం..

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:04 AM

రెండు వారాలకు పైగా క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకున్న ఆసియా క్రీడలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ కళాకారులు తమ సంస్కృతీ సంప్రదాయాలను మరోసారి ప్రేక్షకుల ముందు..

ఖతార్‌లో కలుద్దాం..

ముగిసిన ఆసియా క్రీడలు

నగోయ: రెండు వారాలకు పైగా క్రీడాభిమానులను అమితంగా ఆకట్టుకున్న ఆసియా క్రీడలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో జపాన్‌ కళాకారులు తమ సంస్కృతీ సంప్రదాయాలను మరోసారి ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. 90 నిమిషాలపాటు సాగిన ఈ కార్యక్రమంలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులే కాకుండా సంగీత నృత్య కార్యక్రమాలతో స్టేడియం హోరెత్తిపోయింది. జపాన్‌ యువరాజు ఫుమిహిటో సమక్షంలో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్‌ జోవాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ ఽథానీ తాజా క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఖతార్‌ రాజధాని దోహాలో జరిగే 2030 ఆసియా గేమ్స్‌ నిర్వహణ కమిటీ ప్రతినిధికి ఓసీఏ పతాకాన్ని, ఆసియా క్రీడల టార్చ్‌ను ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌కు అందించారు. మరోవైపు ముగింపు వేడుకల్లో వన్‌ ఆసియా భావనను ప్రతిబింబించేలా స్టేడియం మధ్యలో ఏర్పాటు చేసిన షట్కోణాకార వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జపాన్‌లో వేసవికి ప్రత్యేక చిహ్నమైన లాంతర్లతో వేదికను అలంకరించారు. ప్రముఖుల రాక తర్వాత చెర్రీ పువ్వులతో అలంకరించిన దుస్తువులు ధరించిన నగోయా సంగీత, నృత్య పాఠశాల కళాకారుల ప్రదర్శన సాగింది. అనంతరం కళ్లుచెదిరే లేజర్‌ షోతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వీటి తర్వాత ఫ్లాగ్‌ బేరర్లతో కూడిన ఆయ దేశాల అథ్లెట్ల పరేడ్‌ సాగింది. దీనికి తోడు ఈ క్రీడల సమయంలో ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలతో కూడిన వీడియోలను చూపించారు. ఈసారి ఆసియా క్రీడల్లో 45 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు 50 ప్రపంచ రికార్డులు సహా 350 సరికొత్త గేమ్స్‌ రికార్డులు నెలకొల్పడం విశేషం.

నీరూ ఒక్కరే..

ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో భారత్‌ నుంచి పతాకధారిగా టోర్నీలో మూడు పతకాలు సాధించిన షూటర్‌ నీరూ ధాండా మాత్రమే పాల్గొంది. సహజంగా గేమ్స్‌ ఆరంభ, ముగింపు వేడుకల్లో జాతీయ పతాకాన్ని పట్టుకుని ప్రతీ దేశం నుంచి ఓ పురుష, ఓ మహిళా అథ్లెట్‌ ఉండడం పరిపాటి. కానీ భారత్‌ నుంచి మాత్రం ఒక్కరే ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. పురుష అథ్లెట్‌ పేరును తర్వాత ప్రకటిస్తామని భారత ఒలింపిక్‌ అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ నీరూతోనే ముందుకుసాగారు.


భారత్‌ X పాక్‌ మ్యాచ్‌లకే అత్యధిక వీక్షణలు

భారత్‌,పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్‌లకైనా ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ఆసియా గేమ్స్‌లోనూ వెల్లడైంది. టోర్నీలో భాగంగా భార త్‌-పాక్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ ఫైనల్‌, హాకీ సెమీస్‌ మ్యాచ్‌లకు గేమ్స్‌ చరిత్రలోనే అత్యధిక వీక్షణలు వచ్చినట్టు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. సౌకర్యాలలేమితో ఆరంభమైన ఈ క్రీడల ఆదాయం ఈసారి 20 శాతం పెరిగిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 06:04 AM