తెలుగు వెలుగులు పసిడి మెరుపులు
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:04 AM
ఆసియాడ్ ముగింపు దశకొస్తున్న తరుణంలో భారత అథ్లెట్లు మరింత దుమ్ము రేపుతున్నారు..కాంపౌండ్ ఆర్చర్లు నభూతో అన్న ప్రదర్శన చేశారు....
చికిత 2 స్వర్ణాలతో ధమాకా
ఒలింపిక్ బెర్త్ కైవసం
ఆర్చరీలో మూడు స్వర్ణాలతో క్లీన్‌స్వీ్‌ప
షూటింగ్‌లో నీరూకు మరో గోల్డ్
11వ రోజు ఏడు పతకాలతో మోత
జ్యోతి సురేఖ, గణేశ్‌కు స్వర్ణం
ఆసియాడ్ ముగింపు దశకొస్తున్న తరుణంలో భారత అథ్లెట్లు మరింత దుమ్ము రేపుతున్నారు..కాంపౌండ్ ఆర్చర్లు నభూతో అన్న ప్రదర్శన చేశారు..మూడు స్వర్ణాలతో క్లీన్‌స్వీ్‌ప చేసి తమ బాణాలకు తిరుగులేదని నిరూపించారు..బుధవారం భారత్ సాధించిన నాలుగు పసిడి పతకాల్లో నలుగురు తెలుగు తేజాలు భాగస్వాములయ్యారు..
ఆర్చరీలో యువ క్రీడాకారిణి చికిత రెండు స్వర్ణాలతో డబుల్ ధమాకా సృష్టించింది..సీనియర్ జ్యోతి సురేఖతోపాటు గణేశ్ మణిరత్నం బంగారు పతకాలు అందుకున్నారు..షూటింగ్‌లో హైదరాబాదీ కైనన్ షనాయ్, నీరూ ధాండాతో కలిసి పసిడి పతకం కొల్లగొట్టాడు..బాక్సింగ్, రెజ్లింగ్‌లో కంచు మోత మోగింది.
నగోయ: ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు మరోసారి పతకాలు వెల్లు వెత్తించారు. పదకొండో రోజు పోటీల్లో మనోళ్లు మొత్తం ఏడు పతకాలతో భళా అనిపించారు. ఇందులో నాలుగు స్వర్ణాలుండగా..ఆర్చర్లే అందులో మూడు సొంతం చేసుకున్నారు. మరొకటి షూటింగ్‌లో దక్కింది.
చికిత ‘డబుల్’: లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్(2028)లో కాంపౌండ్ ఆర్చరీ తొలిసారిగా ప్రవేశపెట్టిన నేపథ్యం..మన ఆర్చర్లలో ఎనలేని ఉత్సాహం నింపింది కాబోలు ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేశారు. మిక్స్‌డ్, మహిళల టీమ్, పురుషుల టీమ్ విభాగాలలో మూడుకు మూడు పసిడి పతకాలతో చెలరేగారు. తెలంగాణకు చెందిన 21 ఏళ్ల ఆర్చర్ చికిత తానిపర్తి మిక్స్‌డ్‌తోపాటు, మహిళల టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు చేజిక్కించుకుంది. ఉత్కంఠగా సాగి..షూటా్‌ఫకు చేరిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో చికిత/సాహిల్ జాదవ్ జోడీ 158-157తో కొరియా ద్వయం జుంగ్‌యూన్ పార్క్/చో యున్ గ్యూని చిత్తు చేసింది. కొరియా రజతం, చైనా కాంస్యం అందుకున్నాయి. కాగా..చికిత కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలోనూ తలపడనుంది. దాంతో ఆమె మూడో స్వర్ణం గెలిచే చాన్స్ లేకపోలేదు.
చికిత జోడీకి లాస్‌ఏంజెల్స్ టికెట్
కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ కేటగిరీలో స్వర్ణం నెగ్గిన చికిత/సాహిల్ ద్వయానికి 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను కూడా లభించింది. తద్వారా ఈ విభాగంలో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి దేశంగా భారత్ నిలిచింది.

షెనాయ్ అదుర్స్..
షూటింగ్ ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ విభాగం ఫైనల్లో నీరూ ధాండా, హైదరాబాదీ కైనన్ షెనాయ్ జోడీ ఆరంభంలో తడబాటుకు లోనైనా ఆపై పుంజుకొని 34 పాయింట్ల ఆసియా రికార్డు స్కోరుతో పసిడి పతకం సాధించింది. ఖతార్ రజతం, చైనా కాంస్యం నెగ్గాయి. ఈ స్వర్ణంతో నీరూ ధాండా ఈ క్రీడల్లో రెండో పసిడి పతకం తన ఖాతాలో వేసుకుంది. ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఆమె బంగారు పతకం సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇంకా..ఈసారి ఆసియాడ్‌లో నీరూకిది మూడో పతకం కావడం విశేషం. ట్రాప్ మహిళల టీమ్ ఈవెంట్‌లో 26 ఏళ్ల నీరూ ధాండా రజతం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

ప్రియ, కపిల్, సునీల్‌లకు కాంస్యాలు
బాక్సింగ్ మహిళల 60 కిలోల విభాగంలో ప్రియా ఘంఘాస్ సెమీఫైనల్లో 1-4తో యాంగ్ చెంగ్యూ (చైనా) చేతిలో ఓటమితో కాంస్య పతకానికి పరిమితమైంది. పురుషుల 90 కిలోల సెమీ్‌సలో కపిల్ పొఖారియా 1-4తో తురబేక్ (కజకిస్థాన్) చేతిలో ఓడి కంచు పతకంతో సరిపెట్టుకున్నాడు. రెజ్లింగ్ గ్రీకో రోమన్ 87 కిలోల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం నెగ్గాడు. రాబర్ట్ కల్లుమ్ (ఫిలిప్పీన్స్)ను 4-0తో సునీల్ చిత్తు చేశాడు.
ప్రపంచ రికార్డు సమం చేసిన మహిళల జట్టు
కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో మన ఆర్చర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. చికిత, ఆంధ్రపదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్‌తో కూడిన భారత జట్టు ఫైనల్లో ప్రపంచ రికార్డ్ స్కోరును సమం చేస్తూ 238-234తో చైనా త్రయం ఉనీర్, యీ వాంగ్, ఫాంగ్‌యోను ఓడించి పసిడి పతకం కైసం చేసుకుంది. తద్వారా హాంగ్జౌ ఆసియాడ్‌లో గెలిచిన స్వర్ణాన్ని భారత్ నిలబెట్టుకుంది. చైనా రజతంతో సరిపెట్టుకోగా దక్షిణకొరియా కాంస్యం నెగ్గింది. ఇక.. ఏపీ ఆర్చర్ గణేశ్ మణిరత్నం తిరుమూరు, సాహిల్, కుశాల్ దలాల్‌తో కూడిన భారత త్రయం హోరాహోరీగా సాగిన కాంపౌండ్ పురుషుల టీమ్ తుదిపోరులో 238-237తో చైనా త్రయం జియాహావో, జినియీ లియు, జింగ్‌యుపై గెలిచి బంగారు పతకం ముద్దాడింది. చైనా రజతానికే పరిమితంకాగా, తైపీ కాంస్య పతకం కైవసం చేసుకుంది.

ఈ వార్తలూ చదవండి
దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..
దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..