Share News

పొలంలో సాధన చేసి.. తండ్రి కల నెరవేర్చి..

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:47 AM

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికితకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు ఆర్చరీ నేర్పించాలని ఆమె తండ్రి శ్రీనివాసరావు కలగన్నాడు. కానీ, వాళ్లది పల్లెటూరు..

పొలంలో సాధన చేసి.. తండ్రి కల నెరవేర్చి..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికితకు ఆరేళ్ల వయస్సున్నప్పుడు ఆర్చరీ నేర్పించాలని ఆమె తండ్రి శ్రీనివాసరావు కలగన్నాడు. కానీ, వాళ్లది పల్లెటూరు కావడంతో ఆ క్రీడకు సంబంధించిన వసతులు లేవు. దీంతో తానే కోచ్‌గా అవతారమెత్తి గ్రామంలోని తమ పొలంలోనే కూతురుతో సాధన చేయించాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో వరి కోతలయ్యాక మిగిలిన గడ్డివామునే లక్ష్యంగా చికితతో ప్రాక్టీస్‌ చేయించాడు. ఈ క్రమంలో ఖరీదైన విల్లును కొనేందుకు తమకు జీవనాధారమైన వరికోత యంత్రాన్ని కూడా ఆయన అమ్మాడు. బ్యాంకులో అప్పు తీసుకొని ఆర్చరీ క్రీడకు అవసరమైన పరికరాలను కొని కుమార్తెకు అందించాడు. ఇలా ఆటపై పట్టు సాధించిన ఆమె జాతీయ సబ్‌ జూనియర్‌ పోటీల్లో పాల్గొని రెండు పతకాలు సాధించింది. దీంతో నాలుగేళ్లక్రితం సోనేపట్‌లోని సాయ్‌ ఆర్చరీ అకాడమీలో చోటు దక్కించుకొంది. అక్కడ మరింత రాటుదేలిన చికిత.. నిరుడు చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచక్‌పలో టీమ్‌ విభాగంలో రజతం సాధించి తొలి అంతర్జాతీ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆసియా కప్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం.. వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-21 వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, ఇండోర్‌ వరల్డ్‌ సిరీ్‌సలో మరో స్వర్ణాన్ని అందుకుంది. ఈ ఏడాది వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో రజతం, ఆసియా కప్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో స్వర్ణం కొల్లగొట్టడంతో ఆసియా క్రీడలకు ఎంపికైంది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఇప్పుడు జపాన్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఏకంగా రెండు పసిడి పతకాలతో పాటు లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ కూడా దక్కించుకొని విశ్వక్రీడల్లో కచ్చితంగా పతకం నెగ్గగలదన్న ధీమాను దేశం ముందుంచింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Oct 01 , 2026 | 05:47 AM