Share News

తల్లి కోసం పరితపించిన డెలివరీ బాయ్.. కస్టమర్ చేసిన సాయం వైరల్

ABN , Publish Date - Jul 13 , 2026 | 10:41 AM

తల్లి ఐసీయూలో చికిత్స పొందుతోందని తెలుసుకున్న ఓ జొమాటో డెలివరీ బాయ్‌కు కస్టమర్ చేసిన చిన్న సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఆ కస్టమర్ మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తల్లి కోసం పరితపించిన డెలివరీ బాయ్.. కస్టమర్ చేసిన సాయం వైరల్
Zomato Delivery Partner Viral Story

ఇంటర్నెట్ డెస్క్: ఒక చిన్న సహాయం.. ఒక కుటుంబానికి ఎంతో పెద్ద ఊరటనిచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుసుకున్న ఓ కస్టమర్ అతనికి విమాన టికెట్ బుక్ చేసి ఇంటికి పంపించాడు. అనంతరం జరిగిన పరిణామాలు సోషల్ మీడియాలో వేలాది మందిని భావోద్వేగానికి గురిచేశాయి.


అసలేం జరిగింది?

అంకిత్ పాండే అనే వ్యక్తి 'ఎక్స్' (X) వేదికపై ఈ ఘటనను పంచుకున్నారు. తరచూ తన ఇంటికి ఫుడ్ డెలివరీ చేసే జొమాటో డెలివరీ బాయ్.. ఒకరోజు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తాగడానికి గ్లాసు మంచినీళ్లు అడిగాడు. పాండే అతడిని ఇంట్లోకి ఆహ్వానించి నీళ్లు ఇచ్చాడు. అయితే, అతను చాలా ఆందోళనగా కనిపించడంతో ఏమైందని అడిగాడు.

అప్పుడు డెలివరీ బాయ్.. తన తల్లి అదే రోజు మెట్లపై నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పాడు. వెంటనే స్వగ్రామానికి వెళ్లాలని అనుకున్నప్పటికీ, రాత్రి 11 గంటలకు మాత్రమే రైలు ఉందని, ఆ ప్రయాణానికి దాదాపు 30 గంటలు పడుతుందని తెలిపాడు. 'అమ్మను సమయానికి చూడగలనో లేదో కూడా తెలియడం లేదు' అని అతను బాధతో చెప్పాడు.


విమాన టికెట్ బుక్ చేసిన పాండే

ముందుగా భోజనం చేశావా అని అడగగా, ఇంకా తినలేదని డెలివరీ పార్ట్‌నర్ చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత పాండే దాదాపు రూ.4,000 ఖరీదు చేసే విమాన టికెట్‌ను బుక్ చేశాడు. డెలివరీ బాయ్ తన జీవితంలో ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేదని చెప్పడంతో, విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తన స్నేహితుడిని కూడా సహాయం కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పాడు. దీంతో అతను కొన్ని గంటల్లోనే స్వగ్రామానికి చేరుకుని తన తల్లిని కలుసుకోగలిగాడు.


వైరల్‌గా మారిన కథ

తర్వాతి రోజు ఉదయం డెలివరీ బాయ్.. పాండేకు ఫోన్ చేసి, 'అన్నయ్య... అమ్మ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడింది. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని వైద్యులు చెప్పారు' అని ఎంతో సంతోషంగా తెలిపాడు. అంతేకాకుండా, విమాన టికెట్ కోసం ఖర్చు చేసిన రూ.4,000ను కూడా పాండే ఖాతాకు తిరిగి పంపించాడు. అయితే పాండే ఆ డబ్బును వెంటనే తిరిగి అతనికే పంపించి, ఆసుపత్రి ఖర్చులు, మందుల కోసం ఉపయోగించుకోవాలని సూచించాడు. అప్పుడు డెలివరీ బాయ్ భావోద్వేగంతో.. 'మీరు సహాయం చేయకపోయి ఉంటే నేను అమ్మను సమయానికి చూసే అవకాశం ఉండేది కాదు. నన్ను ఇంటికి త్వరగా చేర్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను' అని కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టమైన సమాచారం లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. కష్టాల్లో ఉన్న వ్యక్తికి అండగా నిలిచిన అంకిత్ పాండే మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే, విమాన టికెట్ కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి పంపించిన డెలివరీ బాయ్ నిజాయితీని కూడా కొనియాడుతున్నారు.


Also Read:

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

ముత్యం ధరిస్తే అదృష్టమా? ఏ రాశులకు శుభమో తెలుసుకోండి

Updated Date - Jul 13 , 2026 | 12:02 PM