Share News

నేను తప్పు చేశానా? ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసిన మహిళ పోస్టు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:34 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. తాను తప్పు చేశానా? అన్న మహిళ ప్రశ్నకు జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

నేను తప్పు చేశానా? ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసిన మహిళ పోస్టు
Central government job resignation

ఇంటర్నెట్ డెస్క్: ఎంతో అదృష్టం ఉంటే గానీ గవర్నమెంట్ జాబ్ లభించదు. ఆర్థిక స్థిరత్వం, సామాజిక హోదా ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం లభించిన వారు ఉబ్బితబ్బిబ్బైపోతుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఓ మహిళ తాజాగా జాబ్‌కు రాజీనామా చేశారు. తన నిర్ణయంపై చివరకు సందేహాలు కలిగిన ఆమె తన మనోభావాలను నెట్టింట పంచుకున్నారు. ఆ మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రియా అనే మహిళ ఈ పోస్టును చేశారు.

‘ఈ రోజే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశా. ప్రస్తుతం నేను జీవితంలో అతి పెద్ద తప్పు చేశానేమో అర్థం కావట్లేదు. అందరూ అదృష్టంగా భావించే దాన్ని నేను కాలదన్నుకున్నానేమో తెలియట్లేదు. కానీ మీరు ప్రయాణిస్తున్న బస్సు మీ గమ్యం దిశగా వెళ్లట్లేదని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు తప్పు చేస్తున్నారని మిగతా వాళ్లు భావిస్తే నిర్ణయాన్ని మార్చుకుంటారా? వాస్తవానికి నాకూ ఏం చేయాలో తెలియట్లేదు’ అని ఆమె అన్నారు.


‘నా జాబ్‌తో ప్రతి నెల క్రమం తప్పకుండా శాలరీ వస్తోంది. లైఫ్ సాగిపోతోంది. కానీ వచ్చే 10 ఏళ్లు ఇలాగే గడిపేయాలని నేను అనుకోవడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. జీవితంలో నిర్లక్ష్యమైన నిర్ణయాలు తీసుకున్నానేమో అర్థం కావట్లేదు’ అని పోస్టు పెట్టారు.

ఈ పోస్టుపై జనాలు రకరకాలుగా స్పందించారు. తీసుకున్న నిర్ణయం సబబుగా అనిపిస్తే వెనక్కు తిరిగి చూడవద్దని అనేక మంది సలహా ఇచ్చారు. ఇతరుల అభిప్రాయాల ప్రకారం జీవితం గడిపితే అసంతృప్తి పెరిగిపోతుందని మరికొందరు అన్నారు. తప్పుడు రైలు ఎక్కినట్టు భావిస్తే వీలైనంత త్వరగా దిగిపోవడం మంచిదని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

9 టు 5 ఉద్యోగం చేయలేక ఆరుసార్లు కెరీర్ మార్చుకుంది.. రాజస్థాన్ మహిళ కథ వైరల్..

భార్యను ప్రేమగా కౌగిలించుకున్న భర్త.. ఎంత పనిజరిగిందో తెలుసా!

Updated Date - Oct 22 , 2026 | 09:46 PM