శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్
ABN , Publish Date - Feb 03 , 2026 | 10:04 AM
ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి రావటంతో అతడు గజగజ వణికిపోయాడు. ఆర్డర్ డెలివరీ చేయకుండానే అక్కడినుంచి పారిపోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఫుడ్ డెలివరీ సమయంలో ప్రమాదాలకు గురై గాయాలపాలైన వారు.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి రావటంతో అతడు గజగజ వణికిపోయాడు. ఆర్డర్ డెలివరీ చేయకుండానే అక్కడినుంచి పారిపోయాడు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ బిర్యానీ పార్శిల్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన చోటుకు వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది. ఆ వ్యక్తి కొంచెం ముందుకు రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని కోరాడు. తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ఆమె అంది.
పార్శిల్‌ను లోపలికి తెచ్చి ఇవ్వమంది. ఫ్రెండ్స్‌తో కలిసి లోపల పార్టీ చేసుకుంటున్నానని ఆ అమ్మాయి చెప్పటంతో అతడు హడలెత్తిపోయాడు. శ్మశానం లోపలికి రాలేనని, ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని కోరాడు. ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా వెళ్లిపోయాడు. అయితే, ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు. అది ఫేక్ వీడియో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరికొంతమంది అది ఏఐ వీడియో అంటున్నారు.
ఇవి కూడా చదవండి
బాస్మతి బియ్యం వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి.!
కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం