Share News

భర్తకు దూరంగా కూర్చున్నందుకు.. విమానంలో మహిళ రోదన.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 20 , 2026 | 02:40 PM

విమానంలో భర్తకు దూరంగా కూర్చోవాల్సి వచ్చినందుకు ఓ మహిళ గంటల తరబడి రోదించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది

భర్తకు దూరంగా కూర్చున్నందుకు.. విమానంలో మహిళ రోదన.. వీడియో వైరల్
Woman cries on flight

ఇంటర్నెట్ డెస్క్: విమానంలో భర్తకు దూరంగా కూర్చోవాల్సి వచ్చినందుకు ఓ మహిళ గంటల తరబడి రోదించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ట్రావెల్ వ్లాగర్ టొమీకో హార్వీ ఈ వీడియోను షేర్ చేశారు. ఇస్తాంబుల్ నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ఓ కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

హార్వీ తెలిపిన దాని ప్రకారం, ఆమెకు విమానంలో నడిచే దారి(అయల్) పక్కనే సీటు లభించింది. ఆమె పక్కనే మధ్య సీటులో ఓ శ్వేత జాతీయురాలు ఉంది. సీట్లు మార్చుకుందామని ఆమె అభ్యర్థించగా తాను తిరస్కరించినట్టు హార్వీ తెలిపారు. విమానంలో 10 గంటల మధ్య సీటులో కూర్చునేందుకు తనకు ఇష్టంలేకపోయిందని చెప్పారు. తమ ముందు ఉన్న రెండో వరుసలోని మధ్య సీటులో ఆమె భర్త కూర్చున్నారని తెలిపారు. ఈలోపు ఆ శ్వేత జాతీయురాలు ఏడుపు మొదలెట్టిందని పేర్కొన్నారు. అయితే ఆమె దాదాపు మూడు గంటల పాటు కన్నీరుపెట్టుకుంటుంటే చూసి షాకయ్యానని అన్నారు.


కన్నీరుపెట్టుకుంటున్న మహిళను చూశాక పలు సందేహాలు కలిగాయని హార్వీ పేర్కొన్నారు. ఆమె కుటుంబంలో ఏదైనా విషాదం సంభవించిందేమోనని తొలుత అనిపించిందని చెప్పారు. ఆమె రిక్వెస్ట్ కాదని తానేమైనా తప్పు చేశానేమో అన్న అపరాధ భావం కూడా కలిగిందని అన్నారు. చివరకు ఉండబట్టలేక ఆమెతో మాట కలిపానని చెప్పారు. ‘ఆమె మూడు గంటలుగా కన్నీరు పెట్టుకుంటోంది. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు? దీంతో, కుటుంబసభ్యులు ఎవరైనా పోయారా? అని ఆమెను అడిగాను. అలాంటిదేమీ లేదని చెప్పింది. ఇలాంటి జర్నీల్లో పక్క సీటులో ఉండే భర్త భుజంపై తలపెట్టుకుని కూర్చోవడం అలవాటని ఆమె చెప్పింది. ఈ జర్నీలో అతడిని మిస్ అవుతున్నానని తెలిపింది. ముందు సీటులో కూర్చున్న ఆమె భర్త మాత్రం ప్రయాణమంతా హ్యాపీగా కునుకు తీశాడు. దీంతో, నేను విస్తుపోయాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.

భర్తకు దూరంగా 10 గంటల పాటు బతికుండగలిగినందుకు ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని అనిపించిందని కూడా హార్వీ సెటైర్లు పేల్చారు. ‘ఆమె ప్రేమ చూశాక నాకు నాపైనే డౌట్ వచ్చింది. నా భర్తపై నాకు అంతటి ప్రేమ లేదేమో అని అనిపించింది’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఉదంతం జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె భర్త కావాలనే ఇలాంటి సీట్లు బుక్ చేసి ఉంటాడని కొందరు సరదా వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

దేవుడా.. ఇంజినీర్‌గా రూ.40 వేలు.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా రూ.1.2 లక్షలు

ఎవరమ్మా నువ్వు.. అది ధైర్యమా? నిర్లిప్తతా? పారిస్ మహిళ వీడియో వైరల్

Updated Date - Oct 20 , 2026 | 02:47 PM