Share News

దేవుడా.. ఇంజినీర్‌గా రూ.40 వేలు.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా రూ.1.2 లక్షలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 11:51 AM

బైక్‌ట్యాక్సీ డ్రైవర్‌తో మాట్లాడాక తనకు జీవితానికి ఉన్న మరో కోణం అర్థమైందంటూ ఓ మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

దేవుడా..  ఇంజినీర్‌గా రూ.40 వేలు.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా రూ.1.2 లక్షలు
Jharkhand bike taxi driver

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో తారసపడే కొందరిని చూస్తే అప్పటివరకూ మనకున్న నమ్మకాలు, అభిప్రాయాలన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. జీవితం మరో కొత్త కోణంలో కనిపిస్తుంది. ఝార్ఖండ్‌లో ఓ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ బైక్‌ట్యాక్సీ డ్రైవర్‌తో మాట కలిపాక తెలిసిన విషయాలను తనను అమితాశ్చర్యానికి గురి చేశాయని ఆమె ఎక్స్ వేదికగా తెలిపింది. బైక్ ట్యాక్సీపై వెళుతున్నప్పుడు డ్రైవర్ తనకు అతడి జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడని పేర్కొంది. ‘నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు అని అడిగా. రూ.4 వేలు సంపాదిస్తానని అతడు అన్నాడు. అంటే నెలకు రూ.1 లక్ష రూపాయలా? అని విస్తుపోతూ అడిగా. ఒక్కోసారి నెలకు రూ.1.2 లక్షల వరకూ వస్తుందని చెప్పాడు. వైట్‌కాలర్ జాబ్స్ చేసే వారికంటే ఎక్కువ సంపాదని అని అతడితో అన్నాను’


‘గతంలో తను ఇంజినీర్‌గా పనిచేసినట్టు అతడు చెప్పుకొచ్చాడు. అప్పట్లో నెలకు రూ.40 వేలు సంపాదించే వాడినని అన్నాడు. ఆ మొత్తం ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేది కాదని చెప్పాడు. అంత చదువు చదివి డ్రైవర్‌గా మారినందుకు ఇబ్బంది పడ్డావా? అని నేను అడిగాను. కుటుంబ అవసరాలు తీర్చడమే తన మొదటి లక్ష్యమని అతడు చెప్పాడు. ఇప్పుడు తాను సంతోషంగా ఉన్నట్టు కూడా తెలిపాడు. దీంతో, నేను షాకైపోయా’ అని ఆమె చెప్పింది.

ఉన్నత చదువులు, మంచి కంపెనీలో ఉద్యోగం, గొప్ప శాలరీ ఇవే విజయానికి కొలమానాలుగా భావించడం ఎంత తప్పో తనకు అతడిని చూశాక అర్థమైందని ఆమె పేర్కొంది. వ్యక్తులు తమ నేపథ్యాలను అనుసరించి సంతోషానికి, విజయానికి తమదైన నిర్వచనం ఇచ్చుకుంటారని చెప్పింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఎవరమ్మా నువ్వు.. అది ధైర్యమా? నిర్లిప్తతా? పారిస్ మహిళ వీడియో వైరల్

ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

Updated Date - Oct 20 , 2026 | 11:53 AM