Share News

ఆత్మవిశ్వాసం ముందు కష్టాలు ఓడిపోయాయి.. వీల్‌చైర్‌పైనే డెలివరీ..

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:21 PM

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు సాగవచ్చని నిరూపిస్తున్నాడు ఓ డెలివరీ బాయ్. కాళ్లు సహకరించకపోయినా, వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చినా తనపై తాను నమ్మకం కోల్పోలేదు.

ఆత్మవిశ్వాసం ముందు కష్టాలు ఓడిపోయాయి.. వీల్‌చైర్‌పైనే డెలివరీ..
Wheelchair Delivery Boy

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎదురయ్యే కష్టాలు లక్ష్యానికి అడ్డంకులు కావని నిరూపిస్తున్నాడు ముంబైకి చెందిన ఓ దివ్యాంగ యువకుడు. కాళ్లు సహకరించకపోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యేకంగా రూపొందించిన మోటరైజ్డ్ వీల్‌చైర్‌పై ఫుడ్ డెలివరీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

వీపుపై ఎరుపు రంగు డెలివరీ బ్యాగ్, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా వీధుల్లో ప్రయాణిస్తున్న అతడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి అతడిని చూసి చేయి ఊపగా.. ఆ యువకుడు చిరునవ్వుతో థంబ్స్ అప్ చూపిస్తూ అభివాదం చేశాడు. మరో సందర్భంలో ట్రాఫిక్ వద్ద ఆగినప్పుడు ఓ వ్యక్తి అతడితో ఆప్యాయంగా కరచాలనం చేసి ప్రోత్సహించాడు. తన శారీరక పరిమితులను చూసి కుంగిపోకుండా.. చిరునవ్వుతో తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్న అతడి ఆత్మవిశ్వాసం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


చిరునవ్వుతో లక్షలాది మంది మనసులు గెలిచి..

ఈ స్ఫూర్తిదాయక వీడియోను 'బియాండ్‌సాక్ష్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. యువకుడి పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే నిరాశ చెందే వారు ఈ యువకుడిని చూసి ఎంతో నేర్చుకోవాలని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. పని చేయడానికి సాకులు వెతికే వారు ఈ యువకుడిని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి పొందుతూ ముందుకు సాగుతున్న అతడి ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 05:39 PM