నదిలో కొట్టుకుపోతున్న శునకం.. కాపాడిన మంత్రి
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:51 PM
నదిలో పడి కొట్టుకుపోతున్న ఓ శునకాన్ని పశ్చిమబెంగాల్ మంత్రి ఇంద్రనీల్ ఖాన్ కాపాడారు. ప్రాణాల కోసం పోరాడుతున్న శునకాన్ని చూసిన వెంటనే ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేయడంతో వారు శునకాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఇంటర్నెట్ డెస్క్: నదిలో పడి కొట్టుకుపోతున్న ఓ శునకాన్ని పశ్చిమబెంగాల్ మంత్రి ఇంద్రనీల్ ఖాన్ కాపాడారు. ప్రాణాల కోసం పోరాడుతున్న శునకాన్ని చూసిన వెంటనే ఆయన ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేయడంతో వారు శునకాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కోల్‌కతాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మంత్రిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
కోల్‌కతాలో నదీ తీరం వెంబడి ఛత్ పూజ ఏర్పాట్లను సమీక్షించేందుకు వెళ్లిన మంత్రికి ఆ శునకం ప్రాణాల కోసం పోరాడుతూ కనిపించింది. అప్పటికే దాని శక్తి మొత్తం తగ్గిపోయినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అక్కడే ఉన్న జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మూడు బోట్లలో వెళ్లి శునకాన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు.
ఒడ్డుకు చేరినప్పటికీ చలితో వణికిపోతున్న శునకాన్ని చూసి చలించిన మంత్రి దానికి వెచ్చగా ఉండేలా టవల్‌ను కప్పారు. గోరు వెచ్చని పాలున్న గిన్నెను దాని ముందు పెట్టారు. శునకం కాస్త కోలుకున్నట్టు కనిపించాకే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన మందిత్రిని అనేక మంది మెచ్చుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!