Share News

మేకపిల్ల కోసం పిల్లాడి సాహసం.. 40 అడుగుల బావిలోకి..

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:00 AM

బావిలో పడ్డ మేకపిల్ల కోసం ఓ బాలుడు సాహసం చేశాడు. నడుముకు తాడు సాయంతో ఎంతో ధైర్యంగా 40 అడుగుల బావిలోకి దిగాడు. బావిలో పడ్డ మేకను పైకి తీసుకువచ్చాడు.

మేకపిల్ల కోసం పిల్లాడి సాహసం.. 40 అడుగుల బావిలోకి..
Bihar boy saves baby goat

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్ రాష్ట్రంలో మనసును హత్తుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. బావిలో పడ్డ మేకపిల్ల కోసం ఓ బాలుడు సాహసం చేశాడు. నడుముకు తాడు సాయంతో ఎంతో ధైర్యంగా 40 అడుగుల బావిలోకి దిగాడు. బావిలో పడ్డ మేకను పైకి తీసుకువచ్చాడు. పెద్దల సాయంతో బాలుడు ఈ సాహసం చేశాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మోతిహారి జిల్లా, పహార్‌పుర్ ఏరియాలోని ఓ గ్రామంలో మేకపిల్ల 40 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. బావిలో నీళ్లు లేకపోవటం‌‌తో మేకపిల్లకు గాయాలయ్యాయి.


అది నొప్పితో విలవిల్లాడుతూ అరవటం మొదలెట్టింది. ఆ అరుపులు విన్న స్థానికులు బావి దగ్గరకు వచ్చారు. బావిలో ఉన్న మేకపిల్లను గుర్తించారు. దాన్ని బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, పెద్ద వాళ్లు బావిలోకి దిగి మేకను బయటకు తీసుకురావటం ప్రమాదమని వారు భావించారు. పిల్లాడిని తాడు సాయంతో కిందకు దించాలని నిశ్చయించుకున్నారు. ఓ పిల్లాడు బావిలోకి దిగడానికి ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. స్థానికులు అతడికి తాడు కట్టి కిందకు దించారు. బాలుడు కిందకు దిగి మేకను గట్టిగా పట్టుకున్నాడు.


స్థానికులు ఎంతో జాగ్రత్తగా తాడును పైకిలాగటంతో బాలుడు, మేక సురక్షితంగా పైకి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పిల్లాడి సాహసానికి నిజంగా సెల్యూట్ చెయ్యాలి. అంత చిన్న వయసులో చాలా ధైర్యంగా బావిలోకి దిగాడు’..‘మేకపిల్లకు భూమ్మీద నూకలు ఉన్నాయి. అందుకే 40 అడుగుల నీళ్లులేని బావిలో పడ్డా చావలేదు’..‘స్థానికులు ఎంతో తెలివిగా మేకపిల్లను బయటకు తీసుకువచ్చారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

గుండబోయిన రాము ఏమయ్యాడు..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి పన్నీరు సెల్వం

Updated Date - Feb 27 , 2026 | 12:41 PM