టార్చ్‌లైట్లతో బెదిరించబోతే జనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:09 PM
అడవి మృగాలతో అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిరూపించే షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పొలాల్లోకి వచ్చిన ఏనుగును బెదిరించి తరిమేయాలని చూసిన గ్రామస్థులకు గజరాజు ఊహించని షాక్ ఇచ్చింది. టార్చ్ లైట్ వేయగానే ఆవేశంతో జనంపైకి దూసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: నీటితో నిండిన వరి పొలంలో ఓ ఏనుగు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బురదమయమైన పొలంలోకి దూసుకొచ్చిన గజరాజును జనం టార్చ్‌లైట్లతో భయపెట్టి వెనక్కి పంపాలని చూశారు. అయితే, ఆ లైట్లు చూసి ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా గ్రామస్థుల మీదకు ఆవేశంగా దూసుకొచ్చింది. ఏనుగు ఆకస్మిక దాడితో దిగ్భ్రాంతి చెందిన ప్రజలు.. ప్రాణాలు దక్కించుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ ఉత్కంఠభరిత దృశ్యాలు వీడియోలో నమోదు కాగా, వన్యప్రాణుల వద్ద అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ ఘటన స్పష్టం చేసింది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ అధికారి డాక్టర్ పి.ఎం. ధకాటే మాట్లాడుతూ.. ‘ఏనుగులు వేగంగా పరుగెత్తలేవని.. వాటిని భయపెట్టడం లేదా ఒక మూలకు నెట్టడం వల్ల అవి ఆవేశంతో దాడికి దిగుతాయి. వన్యప్రాణులు పొలాల్లోకి లేదా జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. అవి సురక్షితంగా వెళ్ళిపోవడానికి తగిన మార్గాన్ని వదిలిపెట్టాలి. ఏనుగులను రెచ్చగొట్టడం ప్రాణాలకే ప్రమాదం’ అని అన్నారు.