వైరల్ కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం.. అక్కునచేర్చుకున్న తల్లి
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:02 PM
వైరల్ కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం అయింది. తల్లితో పాటు మిగిలిన కోతులు కూడా పంచ్‌ను అక్కున చేర్చుకున్నాయి. తల్లి ఒడిలో పంచ్ హాయిగా నిద్రపోతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం అయింది. తల్లితో పాటు మిగిలిన కోతులు కూడా పంచ్‌ను అక్కున చేర్చుకున్నాయి. పంచ్ తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతోంది. తన గుంపుతో కలిసి చక్కగా ఆడుతూ, పాడుతూ తిరుగుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. పంచ్ కున్ (ముద్దుగా పంచ్) అనే కోతి పిల్ల 2025 జులైలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి పంచ్‌ను దూరం పెట్టింది. మళ్లీ దగ్గరకు తీసుకోలేదు. కేవలం తల్లి మాత్రమే కాదు.. గుంపులోని మిగిలిన కోతులు కూడా పంచ్‌ను దగ్గరకు రానివ్వలేదు.
తల్లి దూరం పెట్టడంతో జూ సిబ్బంది 24 గంటలూ పంచ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎమోషనల్‌గా దెబ్బతినకుండా ఉండటానికి బ్లాంకెట్స్, బొమ్మలు ఇచ్చారు. పంచ్ ఒరంగుటాన్ బొమ్మను తనతో పాటు పెట్టుకుంది. ఆ బొమ్మతోటే అటు, ఇటు తిరుగుతూ ఉంది. పంచ్ బొమ్మతో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంచ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. కేవలం పంచ్‌ను చూడ్డానికి జూకు జనం క్యూలు కట్టారు. పంచ్‌ను తల్లి దూరం పెట్టిన కథ తెలిసి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇలాంటి సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పంచ్‌ను కోతుల గుంపు అక్కున చేర్చుకుంది. పంచ్ తల్లి ఒడిలో నిద్రపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘దేవుడు పంచ్‌ను కరుణించాడు. పంచ్‌ను తల్లితో పాటు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’.. ‘ఎన్నో కష్టాల తర్వాత పంచ్ గుంపుతో చేరిపోయింది. ఇది చూడ్డానికి నా రెండు కళ్లూ చాలడం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి
ఉగ్ర ముప్పు.. ఢిల్లీలో హైఅలర్ట్..