షాకింగ్! వందే భారత్‌ను టార్గెట్ చేసి.. పట్టాలపై చెక్క దుంగలను పెట్టి..
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:44 PM
పట్టాలపై చెక్క దుంగలను పేర్చి వందే భారత్ రైలును ఆపినట్టు చెప్పుకుంటున్న కొందరు యువకుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పట్టాలపై చెక్క దుంగలను పెట్టి వందేభారత్ రైలు ఆపేశామని గర్వంగా చెప్పుకుంటున్న కొందరు యువకుల వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. అసలు ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ ఈ వీడియోపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. పట్టాలపై ఆగిపోయిన ఓ రైలును చూపిస్తూ కొందరు యువకులు తెగ మురిసిపోయారు. వందే భారత్ రైలును ఆపేశామంటూ సంబరపడ్డారు. పట్టాలపై భారీ చెక్క దుంగలను వారు పేరుస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి. ఇక ఆగిన రైల్లో నుంచి ఓ కానిస్టేబుల్ బయటకు వచ్చి యువకులను ప్రశ్నించడం కూడా వీడియోలో రికార్డయ్యింది. రైలెక్కే ఉద్దేశం తమకు లేదని, కేవలం రైలును ఆపాలనే తాము అనుకుంటున్నామని కూడా వారు నిర్భీతిగా, నిస్సిగ్గుగా కెమెరాలో రికార్డు చేసుకుంటూ చెప్పారు.
@SouleFacts పేరిట ఉన్న ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఆ యువకులపై మండిపడ్డారు. వేల మంది ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉగ్రచర్యగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. వారిని తక్షణం అరెస్టు చేయాలని ఆర్‌పీఎఫ్, రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద వారిపై కేసు నమోదు చేయాలని అన్నారు.
ఇక ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం రాదని కొందరు అన్నారు. బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గేలా చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్