Share News

వీధి కుక్కలతో జాగ్రత్త.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

ABN , Publish Date - Feb 17 , 2026 | 09:29 PM

వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గేట్ తెరుచుకుని కూతురి ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలిపై దాడి చేశాయి. ఆమె చేతిని రక్తం వచ్చేలా కరిచాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వీధి కుక్కలతో జాగ్రత్త.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..
stray dog attack

ఇంటర్‌నెట్ డెస్క్: వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గేట్ తెరుచుకుని కూతురి ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలిపై దాడి చేశాయి. ఆమె చేతిని రక్తం వచ్చేలా కరిచాయి. హర్షిత్ సింగ్ అనే వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ‘వీధి కుక్కల బెడద.. ఆమె కూతురు తరచుగా వీధికుక్కలకు తన ఇంటి ముందు ఆహారం పెడుతుంది. ఆ వీధి కుక్కలకు ఆమె ఎవరో తెలుసు. అయినా కూడా ఆమెను వదల్లేదు. ఇంటి గేట్‌ను హైజాక్ చేసేశాయి. ఆమె ఇంట్లోకి వెళదామనుకున్నపుడు హాయ్ హలో చెప్పాల్సింది పోయి.. చెయ్యిని కరిచేశాయి’ అని రాసుకొచ్చాడు.


ఆ వీడియోలో ఏముందంటే.. రెండు కుక్కలు ఓ ఇంటి గేటు దగ్గర నిద్రపోతున్నాయి. ఇంతలో ఓ వృద్ధురాలు బ్యాగ్‌తో ఆ ఇంటి గేట్ దగ్గరకు వచ్చింది. గేటు ముందున్న మెట్లపై కుక్కలు పడుకుని ఉండటంతో ఏట వాలుగా ఉన్న ప్రదేశం నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమె కాలు జారింది. కిందపడబోయిన ఆమె బ్యాగ్‌ను మెట్లపై పెట్టి కిందపడకుండా నిలదొక్కుకుంది. అయితే, బ్యాగ్ కుక్క పక్కన పెట్టడంతో కుక్క భయపడిపోయింది.


ఠక్కున పైకి లేచి అరుస్తూ పక్కకు పరిగెత్తింది. రెండో కుక్క కూడా అదే పని చేసింది. తర్వాత రెండు కుక్కలు కలిసి వృద్ధురాలిపై దాడి చేశాయి. ఆ రెండు కుక్కలకు మరో మూడు కుక్కలు తోడయ్యాయి. ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. స్కూటీపై అటు వైపు వెళుతున్న వ్యక్తి కుక్కలను తరిమేశాడు. తల్లి అరుపులు విన్న కూతురు బయటకు వచ్చింది. తల్లిని పైకి లేపి ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది.


ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో వీధికుక్కలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. ఎలాంటి హానీ చేయకపోయినా మనుషులపై దాడులు చేస్తున్నాయి’.. ‘ఆ బ్యాగ్ కారణంగా వృద్ధురాలికి ఈ దారుణమైన పరిస్థితి వచ్చింది. పాపం చెయ్యి నుంచి రక్తం కారుతోంది’..‘స్కూటీ అతను రాకపోయి ఉంటే ఇంకా దారుణంగా కరిచి ఉండేవి’..‘వీధి కుక్కలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ప్రజలు బతకటం కష్టమే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్ల పవర్ సరి చూసుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

Updated Date - Feb 17 , 2026 | 09:53 PM