హైవేపై మినీ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ధ్వంసమైన కార్లు..
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:25 AM
ఇంజిన్‌లో సమస్య కారణంగా అమెరికాలో ఓ మినీ విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రోడ్డుపై ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కార్లపైకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..
వాషింగ్టన్, ఫిబ్రవరి 10: ఇంజిన్‌లో సమస్య కారణంగా ఓ మినీ విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రోడ్డుపై ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం జార్జియా రాష్ట్రం, గైనెస్‌విల్లేలోని ‘లీ గిల్‌మెర్ మెమోరియల్ ఎయిర్‌పోర్టు’ నుంచి ఖెరోకీ కౌంటీ రీజనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది.
గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. దీంతో విమానం ఎయిర్‌పోర్టుకు కూడా తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చివరకు పైలట్ విమానాన్ని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఒక్కసారిగా రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం ముందుకు దూసుకెళ్లింది. ప్లాస్టిక్ స్పింగ్ పోస్టులను దాటి కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఆ రోడ్డును మూసేశారు.
ఈ సంఘటనపై ‘ది నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్’ అధికారులు మాట్లాడుతూ..‘ఇంజిన్‌లో సమస్య కారణంగా విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సంఘటన చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియోలో ప్రమాదం దృశ్యాలు.. మరో వీడియోలో ప్రమాదం తర్వాత దృశ్యాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కెనడాకు వార్నింగ్.. ఆ వంతెనను బ్లాక్ చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి బెదిరింపు..