Share News

జాగా అమ్మితే వచ్చిన డబ్బు.. ఇంట్లో వాళ్లకు దొరక్కుండా భారీ స్కెచ్.. చివరకు..

ABN , Publish Date - Aug 10 , 2026 | 10:42 AM

రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బును దాచే ప్రయత్నంలో ఓ రైతు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు.

జాగా అమ్మితే వచ్చిన డబ్బు.. ఇంట్లో వాళ్లకు దొరక్కుండా భారీ స్కెచ్.. చివరకు..
Rajasthan Farmer buries Currency in Field

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బును దాచే ప్రయత్నంలో ఓ రైతు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసమని దాచిన సొమ్ము మట్టిపాలు కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, పచ్‌పాద్రాకు చెందిన రైతు మంగీలాల్ మేఘ్వాల్ ఏడాది క్రితం కొంత జాగాను విక్రయించగా రూ.5 లక్షలు వచ్చాయి. ఈ డబ్బుతో చిన్న ఇంటిని నిర్మించుకోవాలని మేఘ్వాల్ భావించాడు. అయితే, ఇంత నగదును ఇంట్లో పెడితే ఎవరైనా చోరీ చేసే ప్రమాదం ఉందని భయపడ్డాడు. ఇంట్లో వాళ్లు చేసే వృథా ఖర్చులతో డబ్బు తరిగిపోయే ప్రమాదం ఉందని కూడా అనుకున్నాడు.

డబ్బును ఎలా జాగ్రత్త చేయాలా? అని తెగ ఆలోచించిన అతడికి పొలంలో డబ్బును పాతిపెడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదని అనిపించింది. దీంతో, ఓ రోజు రాత్రి అతడు కుటుంబసభ్యులకు తెలియకుండా పొలానికి వెళ్లాడు. రూ.5 లక్షలను పాలిథీన్ బ్యాగ్‌లో చుట్టి పొలంలో పాతిపెట్టాడు.


ఆ తరువాత కొంతకాలానికి మళ్లీ డబ్బు అవసరం పడింది. కానీ ఆ డబ్బును పాతిపెట్టిన చోటును రైతు మర్చిపోవడంతో చిక్కులు ఎదురయ్యాయి. ఎంత ఆలోచించినా ఆ ప్రదేశం ఏదో గుర్తుకురాలేదు. పొలంలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా వారు పొలంలో వెతికి చివరకు నిరాశగా వెనుదిరిగారు.

ఇటీవల వర్షాలు పడటంతో ఆ కుటుంబం వ్యవసాయానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో దుక్కిదున్నుతుండగా డబ్బు కట్టలున్న బ్యాగు బయటపడింది. అయితే, నోట్లకు చెదలు పట్టి చాలా వరకూ పాడైపోవడంతో వారంతా హతాశులయ్యారు. చివరి ప్రయత్నంగా పాత నోట్లను బ్యాంకులో ఇచ్చి కొత్త నోట్లను తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అయితే, నోట్లు బాగా పాడైపోవడంతో పచ్‌పాద్రా, బలోత్రాలోని బ్యాంకులు తిరస్కరించాయి. జైపూర్‌లోని బ్యాంకులను సంప్రదించాలని సూచించాయి. డబ్బులో కొంతమొత్తమైనా తిరిగొస్తే బాగుండని రైతు మంగీలాల్ ఆశిస్తున్నాడు. పొలంలో డబ్బు పాతిపెట్టకుండా ఉంటే బాగుండేదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.


ఈ వార్తలనూ చదవండి:

తల్లి రీల్స్ పిచ్చి.. చంటి బిడ్డను బ్రిడ్జిపై వదిలేసి..

జబల్‌పూర్‌లో దారుణం.. తల్లిని జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చిన కొడుకు.. వీడియో వైరల్

Updated Date - Aug 10 , 2026 | 11:19 AM