Share News

ఒకప్పుడు బొమ్మే తోడు.. ఇప్పుడు మరో కోతి పిల్లకు రక్షణగా పంచ్..

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:51 PM

ఒకప్పుడు తల్లి ప్రేమకు దూరమై.. ఓ నారింజ రంగు ఒరాంగుటాన్ బొమ్మను హత్తుకుని ఓదార్పు పొందిన పంచ్.. ఇప్పుడు మరో కోతి పిల్లకు అండగా నిలుస్తోంది.

ఒకప్పుడు బొమ్మే తోడు.. ఇప్పుడు మరో కోతి పిల్లకు రక్షణగా పంచ్..
Punch Monkey

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు తల్లి ప్రేమకు దూరమై.. తోటి కోతుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ ఒంటరి జీవితాన్ని గడిపిన పంచ్ అనే కోతి పిల్ల ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తల్లి తిరస్కరించడంతో చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పంచ్‌కు, జంతుప్రదర్శనశాల సిబ్బంది అందించిన ప్రేమ, సంరక్షణ కొత్త జీవితాన్ని ప్రసాదించాయి.

ఇతర కోతులు తనతో కలిసేందుకు ఇష్టపడకపోవడం, కొన్ని కోతులు దూకుడుగా ప్రవర్తించడం వంటి పరిస్థితుల్లో పంచ్‌కు ఒక నారింజ రంగు ఒరాంగుటాన్ బొమ్మ తోడుగా మారింది. ఆ బొమ్మను ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటూ.. దానిని హత్తుకుని ఓదార్పు పొందేది. పంచ్ మానసికంగా ధైర్యంగా ఉండటంతో పాటు శారీరకంగా ఎదగడానికి కూడా ఆ బొమ్మ ఉపయోగపడుతుందని భావించిన జూ సిబ్బంది పంచ్‌కు దానిని అందించారు. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్న కోతికి ఆ బొమ్మ ఒక భద్రతా భావాన్ని కలిగించింది. ఈ క్రమంలో పంచ్ కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పంచ్ అమాయకత్వం, ఒంటరితనం, బొమ్మపై పెంచుకున్న అనుబంధం చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భావోద్వేగానికి గురయ్యారు.


ఇప్పుడు మరో చిన్నారికి రక్షణగా..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పంచ్ జీవితంలో వచ్చిన అద్భుతమైన మార్పును చూపిస్తోంది. ఒకప్పుడు తనను తాను కాపాడుకోవడానికి, ఓదార్పు పొందడానికి ఒక బొమ్మపై ఆధారపడిన పంచ్.. ఇప్పుడు జూలోని ఇతర కోతులతో కలిసి ఆడుకుంటూ, పిల్ల కోతుల దగ్గర ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా ఉంటోంది. ఒక చిన్న కోతి దగ్గరకు నెమ్మదిగా వెళ్లి, దాని పక్కనే పడుకుని, అది తన సమీపంలో ఉన్నంతసేపు అక్కడే ఉండటం నెటిజన్ల మనసులను హత్తుకుంటోంది. ఆ చిన్నారిని కాపాడుతున్నట్లుగా, దాని భద్రతను గమనిస్తున్నట్లుగా పంచ్ ప్రవర్తించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోను పంచుకున్న వాంగ్.. ఒకప్పుడు నారింజ రంగు ఒరాంగుటాన్ బొమ్మను వెంట పెట్టుకుని తిరిగిన అనాథ కోతి పిల్ల ఇప్పుడు పెద్దదై మరో చిన్నారికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. జూలోని సంరక్షకుడు తీసిన ఈ ఫొటోలు, వీడియోలు పంచ్‌లో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోవా మంద్రెమ్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. వీడియో వైరల్

గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే.

Updated Date - Nov 11 , 2026 | 04:33 PM