Share News

మృత్యువును జయించిన బాలుడు.. రెస్క్యూ టీమ్ సాహసానికి సీఎం సెల్యూట్

ABN , Publish Date - May 08 , 2026 | 04:20 PM

ఒడిశాలోని నయగఢ్ జిల్లాలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ బాలుడి కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే..

మృత్యువును జయించిన బాలుడు.. రెస్క్యూ టీమ్ సాహసానికి సీఎం సెల్యూట్
Nayagarh Forest Rescue

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలోని నయగఢ్ జిల్లాలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ బాలుడి కథ సుఖాంతమైంది. కనిపడ అడవిలో తేనె సేకరిస్తుండగా అనుకోకుండా భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు 14 బాలుడు. భారీ బండరాళ్ల మధ్య చిక్కుకుని మృత్యువు అంచులకు వెళ్ళిన బాలుడిని అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ రక్షించారు. ఏడు గంటల పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆ బాలుడికి పునర్జన్మను ప్రసాదించింది.


కనిపడ అడవి ప్రాంతానికి చెందిన ఒక బాలుడు తేనె సేకరించడం కోసం అడవిలోకి వెళ్లాడు. తేనె తుట్టె కోసం వెతుకుతున్న క్రమంలో అకస్మాత్తుగా పట్టు తప్పి రెండు భారీ బండరాళ్ల మధ్య ఉన్న సందులో పడిపోయాడు. ఆ బాలుడి తల రాళ్ల మధ్య గట్టిగా ఇరుక్కుపోయింది. గంటల తరబడి ప్రయత్నించినా బయటకు రాలేక, కనీసం కదలలేని స్థితిలో ఆ బాలుడు విలవిలలాడాడు. స్థానికులు అతడి పరిస్థితిని గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, బండరాళ్లు భారీ పరిమాణంలో ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ అధికారులకు సవాలుగా మారింది. ఏమాత్రం పొరపాటు జరిగినా బాలుడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. అత్యాధునిక హైడ్రాలిక్ పరికరాలను ఉపయోగించి, రాళ్లను నెమ్మదిగా పక్కకు జరుపుతూ ఏడు గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత బాలుడిని క్షేమంగా బయటకు తీశారు.


సీఎం మోహన్ చరణ్ మాఝీ అభినందనలు..

ఈ సాహసోపేతమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యేకంగా అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలకుండా శ్రమించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన బృంద సభ్యుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. బాలుడిని రక్షించిన తీరు అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - May 08 , 2026 | 09:12 PM