Share News

ఆర్టెమిస్-2 ప్రయోగం.. విమానం నుంచి వీడియో రికార్డింగ్!

ABN , Publish Date - Apr 03 , 2026 | 07:16 PM

విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని తన సీటు పక్కనున్న కిటికీ లోంచి రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఆర్టెమిస్-2 ప్రయోగం.. విమానం నుంచి వీడియో రికార్డింగ్!
NASA Artemis 2 launch video

ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఇటీవల ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని నిర్వహించింది. నలుగురు వ్యోమగాములతో రాకెట్ గురువారం (భారత కాలమానం ప్రకారం) తెల్లవారుజామున 3.54 గంటలకు చంద్రుడివైపు విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ దృశ్యాలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించి ఆశ్చర్యపోయారు. అయితే, విమానంలో వెళుతున్న ఒక వ్యక్తి కూడా ఈ ప్రయోగాన్ని రికార్డు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కిమ్ పేరు గల ఒక మహిళ విమానం కిటికీ లోంచి ఈ అద్భుత దృశ్యాలను రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు.

50 ఏళ్ల తరువాత మానవాళి చంద్రుడివైపు అడుగులు వేయడం ప్రారంభించిన తరుణంలో ఈ అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. రాకెట్ ప్రయోగాన్ని ప్రయాణికులు ప్రత్యేక్షంగా వీక్షించగలిగేలా విమానాన్ని దారిమళ్లించిన యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఈ యాంగిల్‌లో ఆర్టెమిస్ ప్రయోగాన్ని చూడటం నిజంగా అద్భుతమని అన్నారు.


ఈ వీడియోకు జనాలు బ్రహ్మరథం పట్టడంతో ఏకంగా 40 మిలియన్‌ల వరకూ వ్యూస్ వచ్చాయి. స్వయంగా నాసా కూడా ఈ వీడియోపై స్పందించింది. ఫస్ట్ క్లాస్ అనుభవం అంటే ఇదే అని కామెంట్ చేసింది. ఇక ఇంతటి అరుదైన అవకాశం లభించిన కిమ్, ఆమె కుటుంబసభ్యులు నిజంగా అదృష్టవంతులని నెటిజన్లు కామెంట్ చేశారు. విమానం కిటికీలోంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడం నిజంగా అద్భుతమైన అవకాశమని అన్నారు. ఇక కమాండర్ రీడ్ వైస్‌మన్ సారథ్యంలో జరుగుతున్న తాజా మిషన్‌లో వ్యోమగాములు జాబిల్లి చుట్టూ పరిభ్రమిస్తూ ఉపరితలాన్ని ఫొటోలు తీస్తారు. 2028లో వ్యోమగాములు చంద్రుడిపై కాలిడేలా నాసా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి:

బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్

రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం

Updated Date - Apr 03 , 2026 | 07:41 PM