పైనాపిల్ ఫెస్టివల్‌లో పాట పాడి, గిటార్ వాయించిన ముఖ్యమంత్రి..
ABN , Publish Date - Jul 13 , 2026 | 01:49 PM
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా పాట పాడి, గిటార్ వాయించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నెటిజన్ల మనసును దోచుకుంటున్నారు. ఓ కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా పాట పాడి, గిటార్ వాయించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇంతకీ సంగతేంటంటే.. మేఘాలయకు చెందిన 'క్యూ' రకం పైనాపిల్ పండ్లను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడం కోసం ఢిల్లీలోని 'దిల్లీ హాట్' వేదికగా ‘4వ మేఘాలయ పైనాపిల్ ఫెస్టివల్’ జరుగుతోంది. జూలై 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది.
ఆదివారం జరిగిన పైనాపిల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంగ్మా యువ మ్యుజీషియన్లతో కలిసి స్వయంగా గిటార్ పట్టుకుని స్టేజ్ ఎక్కారు. బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ ‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే.. తుమ్ దేనా సాత్ మేరా’ పాటను ఎంతో చక్కగా పాడారు. అంతేకాదు.. ప్రసిద్ధ ఇంగ్లీష్ సాంగ్ ‘టేక్ మీ హోమ్, కంట్రీ రోడ్స్’లోని ‘లైఫ్ ఈజ్ ఓల్డర్, ఓల్డర్ దాన్ ది ట్రీస్’ పాటను గిటార్ వాయిస్తూ పాడారు.
దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న జనం ముఖ్యమంత్రి ప్రతిభకు ముగ్ధులైపోయారు. ఈలలు, కేకలు, చప్పట్లతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా పాట పాడి, గిటార్ వాయించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ముఖ్యమంత్రి సంగ్మాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రితో కలిసి ప్రదర్శన ఇచ్చిన యువ రాక్‌స్టార్లంతా మేఘాలయ ప్రభుత్వం నడుపుతున్న 'చీఫ్ మినిస్టర్స్ మేఘాలయ గ్రాస్‌రూట్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్'లో భాగస్వాములు కావటం విశేషం.
ఇవి కూడా చదవండి
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి