Share News

23 నెలల చిన్నారిపై బాలుడి దాడి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jun 26 , 2026 | 01:55 PM

ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ డేకేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై మరో బాలుడు దాడి చేయడం కలకలం రేపింది. 23 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టి, ఏకంగా 25 సార్లు కొరకడం ఆందోళన కలిగిస్తోంది.

23 నెలల చిన్నారిపై బాలుడి దాడి.. వీడియో వైరల్..
Daycare Centre Incident

మహారాష్ట్ర: ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ డేకేర్ సెంటర్‌లో ఓ చిన్నారిపై మరో బాలుడు దాడి చేయడం కలకలం రేపింది. 23 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టి, ఏకంగా 25 సార్లు కొరకడం ఆందోళన కలిగిస్తోంది. డేకేర్ సెంటర్‌లో పిల్లలు ఉన్న గదిలో సిబ్బంది లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, అంత చిన్న వయసులో ఇలా దాడి చేయడంపై నెట్టింట పెద్దఎత్తున చర్చ మొదలైంది.


జూన్ 22న ఉదయం 10:30 గంటలకు ఓ న్యాయవాది తన కుమారుడిని ఫస్ట్‌క్రై ఇంటెల్లిటాట్స్ ప్రీ-స్కూల్‌లో దింపాడు. చిన్నారిని పాఠశాల సిబ్బందికి అప్పగించి పని నిమిత్తం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం నలుగురు చిన్నారులను ఓ మహిళా సిబ్బంది గదిలోకి తీసుకెళ్లింది. వారంతా ఆడుకుంటున్న సమయంలో ఉద్యోగిని నేలపై కూర్చొని ఉంది. కాసేపటికే ఓ బాలుడు బయటకు వెళ్లేందుకు తలుపు తీశాడు. ఇది గమనించిన ఆమె ఆ బాలుడిని బయటకు తీసుకెళ్తూ తలుపు వేసి వెళ్లింది. దీంతో ఏమైందో తెలియదు కానీ, వెంటనే ఓ బాలుడు మరో చిన్నారిపై దాడికి దిగాడు. ముఖం, కళ్లపై తీవ్రంగా కొట్టాడు. నొప్పి తట్టుకోలేక చిన్నారి పక్కనే ఉన్న గోడకు ఆనుకుని ఏడుస్తుండగా.. మూడో బాలుడు అతడి పక్కన నిలబడి ఉన్నాడు. ఇంతలో మళ్లీ దాడికి దిగి కింద పడేసి మరీ పదేపదే విపరీతంగా కొట్టాడు. అది చాలదన్నట్లు ఏకంగా 25 సార్లు కొరికేశాడు. ఇంత జరుగుతున్నా సిబ్బంది మాత్రం గమనించలేదు.


బాలుడు దాదాపు 45 నిమిషాల పాటు ఏడుస్తున్నా సిబ్బంది అటువైపు రాలేదు. ఈ దాడిలో చిన్నారి ముఖం, ముక్కు, పెదవులు, ఛాతీ, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ఆ రోజు మధ్యాహ్నం చిన్నారిని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం దాడి గురించి చెప్పలేదు. ఆడుకుంటుండగా చిన్నారి శరీరంపై కేవలం గీతలు మాత్రమే పడ్డాయని చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానం వచ్చి తల్లిదండ్రులు చిన్నారి బట్టలు తీయగా.. శరీరం అంతటా తీవ్రమైన గాయాలు ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం వెంటనే చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపల్ సహా మొత్తం ఆరుగురు సిబ్బందిపై కేసు నమోదు చేశారు.


అయితే, కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.10 లక్షలు ఇస్తామని, మూడేళ్లపాటు ఉచిత విద్యను అందిస్తామని పాఠశాల యాజమాన్యం ఆఫర్ చేసిందని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ అంశంపై విద్యాశాఖ కూడా స్పందించి పాఠశాలపై విచారణ ప్రారంభించింది. స్కూల్ నిర్వహణకు మున్సిపల్ అధికారుల అనుమతి లేదని విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే, ఆ బాలుడు అంతలా దాడి చేయడానికి గల కారణాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి ప్రవర్తన దేనికి సంకేతమనే అంశంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు నిర్లక్ష్యం ప్రదర్శించిన పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

షాకింగ్ వీడియో.. బాల్కనీలో నిలబడి ఐస్‌క్రీమ్ అందుకుంటుండగా..

మురికి నీళ్లలో ఆకు కూరల్ని కడిగిన వ్యాపారి.. మరీ ఇంత దారుణమా..

Updated Date - Jun 26 , 2026 | 02:55 PM