అమానుషం.. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు..
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:22 PM
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన సంచలనం సృష్టిస్తోంది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతో అర్ధనగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం కలకలం రేపింది.
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన సంచలనం సృష్టిస్తోంది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతో అర్ధనగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం కలకలం రేపింది. ఆమె జుట్టు కత్తిరించడం, మెడలో చెప్పుల దండ వేయడం, ముఖానికి నల్లరంగు పూయడం, ఊరేగించడం వంటి దారుణాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉజ్జయిని జిల్లా ఝర్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్నియా వేగా గ్రామంలో జూన్ 30న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలికి సుమారు 12 నుంచి 14 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. 2023లో భర్తను విడిచిపెట్టి అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని వివాహం చేసుకుంది. అయితే, గతంలో ఆ యువకుడిపై ఆమె అత్యాచారం కేసు నమోదు చేయగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ విషయంపై కొంతకాలంగా మొదటి భర్త కుటుంబ సభ్యులతో వివాదం కొనసాగుతోంది.
ఈ పరిణామాలపై మొదటి భర్త కుటుంబ సభ్యులు, బంధువులు, కొందరు గ్రామస్థులు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి అమానుషంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. మహిళను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి జుట్టు కత్తిరించారు. మెడలో చెప్పుల దండ వేసి, ముఖానికి నల్లరంగు పూశారు. అనంతరం ఆమెను అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ దారుణాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్‌గా మారాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ముగ్గురు మహిళలు సహా మొత్తం 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
గ్రామానికి చేరుకున్న పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు పెరుగుతున్నాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..