Share News

బంగారు, వెండి నగల బ్యాగ్ కొట్టేసిన శునకం..

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:41 AM

కుమారుడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ బంగారు నగల బ్యాగ్ మాయమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బ్యాగ్ చోరీ చేసిన దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారికి షాకింగ్ విషయం కనిపించింది.

బంగారు, వెండి నగల బ్యాగ్ కొట్టేసిన శునకం..
Street Dog Theft

మధ్యప్రదేశ్: కుమారుడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ బంగారు నగల బ్యాగ్ మాయమైంది. అందులో లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు దొంగ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. దొంగ మనిషి కాదని, ఓ వీధి కుక్కని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.


మందసౌర్‌ జిల్లాకు చెందిన లతాబాయి వాల్మీకి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తనతోపాటు రూ.4 లక్షల విలువైన నగల బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అయితే, సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 6 గంటల మధ్య ఆ బ్యాగ్ కనిపించకుండా పోయింది. అందులో వెండి నడుము పట్టీ, వెండి పట్టీలు, బంగారు మంగళసూత్రం, రెండు ఉంగరాలు, వెండి గజ్జెలు, బంగారు పూసలు, చెవి దిద్దులు, ముక్కుపుడక, వెండి మెట్టెలతో పాటు సుమారు రూ.2 వేలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.4 లక్షల వరకు ఉంటుంది. బ్యాగ్ పోవడంతో లబోదిబోమంటూ బాధితురాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలెట్టారు. అదే సమయంలో ఆస్పత్రి లోపల ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు. వీటి ద్వారా బ్యాగును చోరీ చేసిన నిందితులు, అనుమానితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందని భావించారు. ఈ మేరకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. అర్ధరాత్రి సమయంలో ఓ వీధి కుక్క పోస్ట్ సర్జికల్ వార్డులోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఉన్న బ్యాగ్‌ను నోట కరుచుకున్న శునకం.. దర్జాగా బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.


కుక్క వెళ్లిన దారిని పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా ట్రాక్ చేశారు. చివరకు ఆస్పత్రి ప్రాంగణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో ఆ బ్యాగ్ కనిపించింది. అందులోని నగలు, నగదు సురక్షితంగానే ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం లతాబాయికి పోలీసులు బ్యాగును అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

సెక్యూరిటీ గార్డులపై రెచ్చిపోయిన మహిళ.. మరీ ఇంత దారుణమా..

టన్నెల్‌లో రైలు పట్టాలపై చిరుతపులి.. లోకో పైలట్ ఏం చేశాడంటే..

Updated Date - Aug 28 , 2026 | 11:17 AM