Share News

చంద్రగ్రహణం 2026.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:20 PM

ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే, ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి, చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం..

చంద్రగ్రహణం 2026.. ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
Lunar Eclipse 2026

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యమైన చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3.21గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 7.52గంటల వరకు ఉండనుంది. శాస్త్రీయంగా ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ, భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణానికి ఆధ్యాత్మిక, ధార్మిక ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో రాహు, కేతువుల ప్రభావం ఉంటుందని నమ్మకం. అందుకే ఈ సమయంలో కొన్ని నియమాలను పాటించడం ఆనవాయితీగా వస్తోంది.


గ్రహణ సమయంలో ఏమి చేయాలి?

సంప్రదాయ విశ్వాసాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో ఇష్టదేవతను ప్రార్థించడం శ్రేయస్కరం. అలాగే, ధ్యానం చేయడం మంచిదని భావిస్తారు. గ్రహణం ప్రారంభమైన తర్వాత ఆహారం తీసుకోవద్దని పెద్దలు చెబుతారు. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు వాయిదా వేయాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిది. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గర్భిణులు బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత దానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్మకం.

meditation.jpg


గ్రహణ సమయంలో చేయకూడనివి..

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. చంద్రగ్రహణ సమయంలో బట్టలు ఉతకడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. అదే విధంగా వంట చేయడం, ఇంటిని ఊడ్చడం, తుడవడం వంటి పనులను చేయకూడదంటారు. గ్రహణ కాలంలో కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదనే నమ్మకం ఉంది.

Washing.jpg

ఈ సమయం సాధారణ గృహ పనులకు అనుకూలంగా ఉండదని భావిస్తారు. అందుకే గ్రహణం ప్రారంభమయ్యే ముందు ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మంచిదని సూచిస్తారు. లేకపోతే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి పూజ చేయడం మంచిదని అంటారు. తర్వాత పనులను మొదలు పెట్టడం ఆచారమని చెబుతారు.

అయితే శాస్త్రీయంగా చూస్తే గ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన మాత్రమే. ఈ నియమాలు పూర్తిగా సంప్రదాయ విశ్వాసాల ఆధారంగానే ఉన్నాయి. మొత్తంగా చంద్రగ్రహణాన్ని భయంతో కాకుండా అవగాహనతో చూడాలి. విశ్వాసాలు పాటించాలనుకునేవారు నియమాలు అనుసరించవచ్చు. శాస్త్రీయంగా ఇది ఒక అందమైన ఆకాశ సంఘటన మాత్రమే.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

హోలీ వేడుకల్లో తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?

హోలీ స్పెషల్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

For More Latest News

Updated Date - Mar 03 , 2026 | 12:35 PM