లూధియానాలో ఐఫోన్ చోరీ.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:57 AM
పంజాబ్‌లోని లూధియానాలో ఐఫోన్ చోరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొనుగోలుదారుడిలా మొబైల్ షాపునకు వచ్చిన ఓ దొంగ ఫోన్‌ను చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఐఫోన్ తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు యత్నించాడు.
లూధియానా: పంజాబ్‌లోని లూధియానాలో ఐఫోన్ చోరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొనుగోలుదారుడిలా మొబైల్ షాపునకు వచ్చిన ఓ దొంగ ఫోన్‌ను చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. ఐఫోన్ తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు యత్నించాడు. అయితే, అప్రమత్తమైన యజమాని పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. దొంగ అతడిని దాదాపు 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
లూధియానాలోని ఓ మొబైల్ షాపునకు ఆదివారం ఉదయం సుమారు 11 గంటలకు ఓ వ్యక్తి వచ్చాడు. ఐఫోన్‌ను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయడం గురించి షాపు యజమాని మీత్‌ను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, మధ్యాహ్నం సుమారు 2:55 గంటలకు తిరిగి షాపునకు వచ్చాడు. ఈసారి ఫోన్లను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను తీసుకుని తన చొక్కా జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత క్షణం ఆలస్యం చేయకుండా షాపు నుంచి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అయితే, వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని మీత్.. నిందితుడిని పట్టుకునేందుకు బయటకు పరిగెత్తాడు. ద్విచక్ర వాహనం వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ నిందితుడు వేగం పెంచడంతో మీత్‌ను రోడ్డుపై సుమారు 10 నుంచి 15 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. చివరకు స్కూటీ అదుపుతప్పి పడిపోవడంతో ఐఫోన్, ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి దొంగ పారిపోయాడు. ఈ ఘటనలో మీత్ మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇంగ్లండ్‌లో విషాదం.. పులి దాడిలో యువకుడి మృతి..
ఇంచ్ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..