టన్నెల్‌లో రైలు పట్టాలపై చిరుతపులి.. లోకో పైలట్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:25 PM
ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ - కట్ని రైల్వే లైన్‌లోని 'భన్వార్‌టంక్' టన్నెల్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ - కట్ని రైల్వే లైన్‌లోని 'భన్వార్‌టంక్' టన్నెల్‌లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది. ఖోంగ్సరా - భన్వార్‌టంక్ సెక్షన్ మధ్య నడుస్తున్న రైలు అదే సమయంలో టన్నెల్‌లోకి ప్రవేశించింది. దూరంగా ట్రాక్‌పై వెళ్తున్న చిరుతపులిని గమనించిన లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైలు వేగాన్ని తగ్గించాడు.
దీంతో చిరుతకు ప్రమాదం తప్పింది. వెనుక రైలు వస్తున్నప్పటికీ చిరుతపులి ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ట్రాక్‌ల మధ్యే నడుస్తూ ముందుకు సాగింది. రైలు కూడా అంతే నెమ్మదిగా దాని వెనుకే అనుసరించింది. కొంత దూరం టన్నెల్‌లో ప్రయాణించిన తర్వాత ఆ చిరుతపులి రైల్వే ట్రాక్ దాటి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. రైలులో ఉన్న గార్డు ఈ అరుదైన దృశ్యాన్ని తన మొబైల్‌లో రికార్డు చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కొండలు, దట్టమైన అడవులతో కూడుకున్నది కావడం వల్ల ఇక్కడ చిరుతపులులు, ఏనుగుల సంచారం సాధారణమేనని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. అయితే, అడవి గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌లను కాలినడకన తనిఖీ చేసే రైల్వే గ్యాంగ్‌మెన్, కీమెన్‌ల భద్రతపై ఈ ఘటనతో మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..
న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో చిన్నారులకు 100 బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి పంపిణీ