Share News

ఐఫోన్ దొంగతనం చేసిన పోలీస్ కానిస్టేబుల్.. పట్టించిన సీసీటీవీ కెమెరా

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:22 PM

కాస్ట్‌లీ ఫోన్ కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారిపోయాడు. సెల్‌ఫోన్ షాపులో అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను దొంగిలించాడు. షాపులోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయాడు.

ఐఫోన్ దొంగతనం చేసిన పోలీస్ కానిస్టేబుల్.. పట్టించిన సీసీటీవీ కెమెరా
Jaunpur police constables theft

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కర్తవ్యాన్ని మరిచాడు. కాస్ట్‌లీ ఫోన్ కోసం దొంగగా మారిపోయాడు. సెల్‌ఫోన్ షాపులో అత్యంత ఖరీదైన ఓ ఐఫోన్‌ను దొంగిలించాడు. షాపులోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


జౌన్‌పూర్‌లోని లైన్ బజార్‌లో ఓ మొబైల్ షాప్ ఉంది. గత శనివారం నాడు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆ షాపులోకి వచ్చారు. తమకు కాస్ట్‌లీ ఫోన్లు చూపించమని సేల్స్ గర్ల్‌‌కు చెప్పారు. ఆమె కొత్త కొత్త మోడల్స్ తీసి వారి ముందు పెట్టింది. వారు ఆ ఫోన్లను చేతుల్లోకి తీసుకుని చెక్ చేయసాగారు. కొద్దిసేపటి తర్వాత సేల్స్ గర్ల్ ఫోన్ మాట్లాడటంలో బిజీ అయిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ కానిస్టేబుల్.. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను జేబులో పెట్టేసుకున్నాడు. సేల్స్ గర్ల్‌కు అనుమానం రాకుండా ఉండటానికి కొద్దిసేపు ఆమెతో మాట్లాడి అక్కడినుంచి వెళ్లిపోయారు. డిస్ ప్లేలో ఉంచిన 1.6 లక్షల రూపాయల ఐఫోన్ కనిపించకపోవటంతో షాపు యజమాని శివమ్‌కు అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజీ చూశాడు. అందులో కానిస్టేబుల్ ఐఫోన్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.


శివమ్ నేరుగా ఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి సదరు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను ఆయనకు చూపించాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ దొంగతనం చేసిన ఫోన్‌ను శివమ్‌కు తిరిగి ఇచ్చేశారు. ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు పోలీస్ కానిస్టేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్డు తినొద్దు

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Updated Date - Feb 11 , 2026 | 01:52 PM