Share News

పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా.. 7.1 తీవ్రతతో భూకంపం.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Aug 07 , 2026 | 02:42 PM

ఆపరేషన్ చేస్తుండగా భారీ భూకంపం సంభవించడంతో రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా.. 7.1 తీవ్రతతో భూకంపం.. షాకింగ్ వీడియో
Surgeons Shield Patient During Earthquake in Japan

ఇంటర్నెట్ డెస్క్: భూకంపం సందర్భంగా భారీ భవనాలు నేలమట్టమైన ఘటనలు ఇప్పటికే ఎన్నో చూశాం. అయితే, ఆపరేషన్ చేస్తుండగా భారీ భూకంపం సంభవించడంతో రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఆపరేషన్ థియేటర్ లోపక భయానక వాతావరణం కనిపించింది. అంతటి విపత్తులోనూ వైద్యులు ప్రదర్శించిన నిబద్ధత జనాలను ఆకట్టుకుంటోంది.

జులైై 28న క్యూషూ ద్వీపరంలో ఈ భూకంపం సంభవించింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆపరేషన్ జరుగుతుండగా ఒక్కసారిగా భూమి కంపించింది. ప్రకంపనల తీవ్రతకు ఆపరేషన్ థియేటర్‌లోని టేబుల్స్, లైట్లు, ఇతర పరికరాలు పూనకం వచ్చినట్టు అటూ ఇటూ కదిలాయి. డాక్టర్లు నిలబడలేక నానా తంటాలు పడ్డారు. చేతికందిన వాటిని పట్టుకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేపెంట్‌ విషయంలో తమకున్న బాధ్యతను వారు మర్చిపోలేదు.


అచేతనంగా ఆపరేషన్ బెడ్‌పై పడి ఉన్న రోగి ప్రాణాల్ని కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. రోగి ఉన్న బెడ్ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. పేషెంట్‌పై ఏదీ పడకుండా అడ్డుగా నిలబడ్డారు. భయంతో బయటకు పరుగులు తీయాల్సిన వారు పేషెంట్‌ను కాపాడటంపైనే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటి తరువాత శస్త్రచికిత్స యథావిధిగా కొనసాగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు 5 తరువాత ఆసుపత్రిలో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యాయి.

ఈ భూకంపంలో 38 మంది బలైపోయారు. 120 మందికిపైగా గాయపడ్డారు. పలు చోట్ల భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజుల పాటు వేల కొద్దీ ఇళ్లకు మంచినీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ భూకంపం తీవ్రత కారణంగా పొరుగున ఉన్న దక్షిణ కొరియాలో కూడా పలు చోట్ల భూమి కంపించింది.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై లోకల్ ‌ట్రైన్‌లో అమానుషం.. మహిళపై వ్యక్తి దాడి..

గుజరాత్‌లో ప్రజలను భయపెడుతున్న బావి రహస్యం..

Updated Date - Aug 07 , 2026 | 03:30 PM