ఆకాశంలో వింత .. అది యూఎస్ ప్రయోగించిన బ్లాక్ మాంటా!
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:42 PM
ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో కనిపించిన వింత వస్తువు ఏంటనే అంశంపై చర్చ పతాకస్థాయికి చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో ఇటీవల కనిపించిన వింత వస్తువు ఏంటనే అంశంపై చర్చ పతాకస్థాయికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. అది గ్రహాంతర వాసుల వ్యోమనౌక అయి ఉండవచ్చన్న వాదనలు వినిపించినప్పటికీ ప్రస్తుతం చర్చ ‘బ్లాక్ మాంటా’ చుట్టూ తిరుగుతోంది.
ఏమిటీ బ్లాక్ మాంటా..
సెప్టెంబర్ 20న టెహ్రాన్ గగనతలంలో ఓ వింత వస్తువు కనిపించింది. రంగురంగుల లైట్లు అమర్చినట్టు అర్ధచంద్రాకారంలో ఉన్న వస్తువును చూసి జనాలు షాకైపోయారు. మరుసటి రోజు కూడా ఇదే తరహా దృశ్యం కొందరికి కనిపించింది. అయితే, ఇది వాస్తవానికి త్రికోణం ఆకారంలో ఉన్న బ్లాక్ మాంటా అన్న వాదన ప్రస్తుతం నెట్టింట బలంగా వినిపిస్తోంది. శత్రుదేశాలపై నిఘా పెట్టేందుకు అమెరికా దీన్ని ప్రయోగించిందని కొందరు చెబుతున్నారు.
ప్రపంచానికి తెలియని ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌ను హెచ్చరించారు. తలుచుకుంటే తాము ఇరాన్‌ను భూమ్మీద మిగలకుండా చేస్తామన్నారు. అయితే, బ్లాక్ మాంటా విషయంలో మాత్రం అమెరికా ఇప్పటివరకూ ఏనాడు స్పందించలేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది.
అసలు బ్లాక్ మాంటా ఎలా పనిచేస్తుందనే దానిపై కూడా అనేక కథనాలు నెట్టింట వ్యాప్తిలో ఉన్నాయి. ఏమాత్రం శబ్దం చేయకుండా ఇది గగనతలంలో విహరించగలదని కొందరు చెబుతున్నారు. ఇది అణుఇంధన శక్తితో ప్లాస్మాను వెదజల్లుతూ ముందుకు దూసుకెళుతుందని అన్నారు. క్షణాల్లో కళ్లుచెదిరే వేగాన్ని అందుకోగలదని చెప్పారు.

అసలు అయెరికా వద్ద ఇలాంటి నిఘా విమానం ఒకటి ఉందన్న విషయాన్ని 2021లో ఇరాన్ మీడియా ప్రచురించింది. ఓ యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌పై త్రికోణాకారంలో ఉన్న విహంగం చిత్రాన్ని ప్రచురించింది. అంతకుముందే బ్లాక్ మాంటా గురించి అనేక వార్తలు వ్యాప్తిలో ఉన్నాయి. లాస్ వేగస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిస్కవరీ సైన్స్ (ఎన్ఐడీఎస్) ఈ ఉదంతంపై అధ్యయనం నిర్వహించింది. పలుమార్గాల్లో సమగ్ర సమాచారాన్ని సేకరించింది. అయితే, 2004లోనే సంస్థ మూత పడటంతో ఆ ఆధ్యయనానికి కూడా ముగింపు పడింది.
వాస్తవానికి ఇలాంటి విహంగాలను నిర్మించిన చరిత్ర అమెరికాకు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు ఎఫ్-117 నైట్‌హాక్ విమానం ఉదంతం మంచి ఉదాహరణ అని అంటారు. 1980ల్లో ఈ విమానం పెను సంచలనం రేకెత్తించింది. 1983లో వింత వెలుగులు వెదజల్లే విహంగాన్ని అనేక మంది వీక్షించారు. అది గ్రహాంతరవాసుల వ్యోమనౌక అని అనుకున్నారు. అయితే, 1988లో అమెరికా దానిపై స్పష్టత ఇచ్చింది. అది ఎఫ్-117 నైట్ హాక్ అని ప్రకటించింది. దీంతో, తాజా ఉదంతానికి తెరపడాలంటే మరికొన్నేళ్లు ఆగాలని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రెండు నెలల వ్యాయామం.. ఖరీదైన బహమతులు.. దక్షిణ కొరియా కంపెనీ ఆఫర్ వైరల్..
మహిళ వేషంలో సీరియల్ కిల్లర్.. మారుమూల అడవులే అతడి అడ్రస్