Share News

జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫొటోషూట్.. చివరికి ఏమైందంటే..

ABN , Publish Date - Aug 22 , 2026 | 06:08 PM

ఇండోర్‌లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఫొటోషూట్ చేసి హంగామా చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని  ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫొటోషూట్.. చివరికి ఏమైందంటే..
Indore Influencer Viral Video

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకృతి గౌర్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు నిలిచిన సమయంలో జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఫొటోలు, వీడియోలకు పోజులిచ్చినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ప్రాథమిక విచారణలో ఈ ఫొటోషూట్ ఇండోర్‌లోని లాంతర్న్ స్క్వేర్ ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించడం వంటి అంశాలపై పోలీసులు వీడియోను పరిశీలిస్తున్నారు.


వైరల్ వీడియోలో.. వాహనాలు సిగ్నల్ వద్ద నిలిచి ఉన్న సమయంలో ఇన్‌ఫ్లుయెన్సర్ జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఫొటోషూట్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా కంటెంట్‌కు సంబంధించి పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ జారీ చేసిన నివారణ ఉత్తర్వుల పరిధిలోనూ ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సోషల్ మీడియా కోసం కంటెంట్ రూపొందించే సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


ఇక వైరల్ అవుతున్న వీడియోపై ప్రకృతి గౌర్ స్పందించింది. తన చర్య పట్ల విచారం వ్యక్తం చేస్తూ మరో వీడియోను విడుదల చేసింది. తన ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియోను సందర్భానికి అనుగుణంగా చూపించకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లు నిర్వహించే సమయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. భద్రత, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పట్ల తనకు గౌరవం ఉందని, హద్దులు దాటే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.

Updated Date - Aug 22 , 2026 | 06:48 PM