మహిళల డ్రెస్ వేసుకుని అర్ధరాత్రి స్కూటీ రైడ్.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 18 , 2026 | 08:29 PM
దేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందో పరీక్షించేందుకు ఓ యువకుడు చేసిన ప్రయోగం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందో పరీక్షించేందుకు ఓ యువకుడు చేసిన ప్రయోగం సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. BeJaintle పేరిట ఉన్న అకౌంట్‌లో ఆ యువకుడు ఈ వీడియో చేశాడు. అర్ధరాత్రి వేళ పరిస్థితులను చూశాక భయం వేసి తన ప్రయోగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని చెప్పాడు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ యువకుడు మొదట మహిళల డ్రెస్ వేసుకున్నాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి దుపట్టా చుట్టుకుని స్కూటీపై బయలుదేరాడు. వెనుక అతడి స్నేహితులు అనుసరిస్తూ వీడియోలో రికార్డు చేశారు. రాత్రి వేళ తనను పురుషులు గుచ్చి గుచ్చి చూశారని ఆ యువకుడు చెప్పాడు. పెట్రోల్ పంప్ వద్ద కూడా అలాగే ఇబ్బందికరంగా చూశారని అన్నాడు. కొందరు తననే ఫాలో అయ్యారని చెప్పాడు. ఓ వ్యక్తి ఏకంగా తనతో మాట కలిపేందుకు ప్రయత్నించాడని తెలిపాడు.
ఒకానొక దశలో మరింత భయానక అనుభవం ఎదురైందని చెప్పాడు. స్కూటీ నడుపుతుండగా ఇద్దరు ఆటోవాలాలు తమ వాహనాలతో దగ్గరగా వచ్చారని చెప్పారు. తన స్నేహితులు ఇదంతా రికార్డు చేస్తున్నారని గుర్తించిన ఓ ఆటోవాలా అక్కడి నుంచి వెళ్లిపోగా మరో వ్యక్తి మాత్రం తన వాహనాన్ని పదే పదే తన వైపు డ్రైవ్ చేశాడని చెప్పాడు. రాను రాను పరిస్థితి భయానకంగా మారడంతో తాను ఆ ప్రయోగాన్ని కట్టిపెట్టానని అతడు తెలిపాడు.
‘ఈ రెండు గంటల్లో పరిస్థితి ఎంతో జుగుప్సాకరంగా మారింది. సైకిల్, బైక్, ఆటో, కార్, ఇలా అన్ని వాహనాల్లోని వారు నన్ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి వేళ ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లడం సేఫ్ కాదని నాకు అర్థమైంది’ అని అతడు చెప్పాడు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 17 మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వార్తలను చదవండి:
ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్
బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!