1బీహెచ్‌కే ఫ్లాట్ కూడా కొనలేని మాకు పిల్లలు వద్దు.. వైరల్ పోస్టు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:00 PM
సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కొనలేని స్థితిలో ఉన్నందుకు పిల్లలు వద్దనుకున్న ఒక జంట ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ భార్యాభర్తలిద్దరూ సంపాదనపరులే.. వారి వార్షిక ఆదాయం రూ.36 లక్షలు. అయినా వారు పిల్లల్ని వద్దనుకున్నారు. తమకు పిల్లల్ని పోషించే స్తోమత లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నిర్ణయం గురించి ఆ దంపతుల బంధువు ఒకరు నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హర్ష గుప్తా అనే నెటిజన్ ఈ పోస్టును పెట్టారు. తన బంధువు ఒకరు నెలకు దాదాపు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పారు. ఆయన భార్య కూడా నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారని అన్నారు. ‘నా బంధువు గురుగ్రామ్‌లో ఉంటాడు. ఆయన వయసు 35. తనకు పిల్లలు వద్దని అంటున్నారు. ఆయన సంపాదనకు గురుగ్రామ్‌లో కనీసం సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కూడా రాదట. తన కోసం ఒక గూడు సమకూర్చుకోలేనప్పుడు ఇక పిల్లలు ఎందుకని అంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజుల కింద నెలకు రూ.40 వేలు భరించేంత స్థాయి తనకు లేదని కూడా ఆయన తెలిపారు’ అని తన పోస్టులో గుప్తా రాసుకొచ్చారు.
తన బంధువు నిర్ణయానికి ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. నగరాల్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు, స్కూలు ఫీజులు, ఇతరత్రా జీవన వ్యయాల వల్ల అనేక జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.
ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ జంట నిర్ణయంతో ఏకీభవించారు. స్థిర ఆదాయం, జీవితం లేనప్పుడు పిల్లలు వద్దనుకోవడం తప్పుకాదని అన్నారు. మరికొన్నేళ్లల్లో ఆ జంటకు తాము చేసిన తప్పు తెలిసి వస్తుందని మరికొందరు హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న దొంగ.. రాత్రంతా నరకయాతన.. వీడియో వైరల్
సైకిల్ తొక్కాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ నిబంధన ఎప్పుడు మారిందంటే..