Share News

భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా అదృష్టం: చిరంజీవి

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:26 AM

ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీరాజా మరణంతో భారత సినీరంగం గొప్ప కథకుడిని కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా అదృష్టం: చిరంజీవి
Chiranjeevi tribute to Bharathiraja

హైదరాబాద్, జూన్ 10: ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారతీరాజా మరణంతో భారత సినీరంగం గొప్ప కథకుడిని కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ భారతీరాజా గ్రామాల్లోని మట్టి పరిమళాలను, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సాధారణ జనాల భావోద్వేగాలను అద్భుతమైన దృశ్య కావ్యాలుగా మలిచారు. ఆయన సినిమాలు లక్షలాది మంది జనం హృదయాలను తాకాయి’..


ఎంతో మంది ఫిల్మ్‌మేకర్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. భారత సినీ పరిశ్రమకు ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర చేశాను. సినిమాపై ఆయనకున్న మక్కువ, వృత్తి పట్ల అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి. భారతీరాజా మన మధ్య లేకపోయినా.. ఆయన తీసిన అద్భుతమైన చిత్రాల రూపంలో వారసత్వం కొనసాగుతుంది. ‘ఇయక్కునర్ ఇమయం(దర్శక దిగ్గజం)’ భారతీరాజా ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని రాసుకొచ్చారు.


వృద్ధాప్య సంబంధిత సమస్యలతో..

దర్శక దిగ్గజం భారతీరాజా గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు. 84 ఏళ్ల వయసులో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీరాజా మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు పాండ్య దూరం

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్

Updated Date - Jun 10 , 2026 | 11:37 AM