Share News

మండుతున్న ట్రక్కుతో ప్రయాణం.. డ్రైవర్ సాహసానికి హ్యాట్సాఫ్

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:57 PM

ఓవైపు ట్రక్కు మొత్తం మంటలు.. మరోవైపు జనాలతో కిక్కిరిసిన రోడ్డు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. అయినా డ్రైవర్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను లెక్కచేయకుండా మండుతున్న ట్రక్కును జనావాసాలకు దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే..

మండుతున్న ట్రక్కుతో ప్రయాణం.. డ్రైవర్ సాహసానికి హ్యాట్సాఫ్
Burning Truck Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎండుగడ్డి లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ట్రక్కు పైభాగం నుంచి భారీగా మంటలు, దట్టమైన పొగ ఎగసిపడుతున్నప్పటికీ.. డ్రైవర్ భయపడకుండా వాహనాన్ని ముందుకు నడిపించాడు. చుట్టూ ఇళ్లు, దుకాణాలు, ప్రజలు ఉన్న ప్రాంతంలో ట్రక్కును నిలిపివేయడం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో.. డ్రైవర్ దాన్ని జనాలకు దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.


జనావాసాలకు దూరంగా తీసుకెళ్లిన డ్రైవర్..

మహేశ్వరి–సహారన్‌పూర్ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు వైరల్ వీడియోలో పేర్కొంటున్నారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ట్రక్కుపై ఉన్న ఎండుగడ్డి కాలిపోతూ రోడ్డుపై పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంత ప్రమాదకర పరిస్థితిలోనూ డ్రైవర్ ట్రక్కును ముందుకు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారీ ప్రమాదాన్ని నివారించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ సాహసాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే.. మంటలు ఎలా చెలరేగాయన్నది అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఈ వీడియో @WokePandemic అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘నిజంగా ఆ డ్రైవర్ కి హ్యాట్సాఫ్’ అని, ‘మంటలు చూడగానే.. వ్యాన్ వదిలి వెళ్లకుండా ప్రాణాలకు తెగించి ఆ డ్రైవర్ నిజంగా గ్రేట్’ అని ఒకరు, ‘పెద్ద గండం గడిచింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..

నేపాల్‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. కొత్తగా రెండు హిమ సరస్సుల గుర్తింపు..

Updated Date - Aug 29 , 2026 | 08:20 PM