కొంపముంచిన రీల్స్ పిచ్చి.. మూతి కాలిపోయిందిగా..
ABN , Publish Date - Feb 05 , 2026 | 09:43 AM
ఓ యువకుడు రీల్స్ కోసం అగ్గితో ఆటలాడాడు. ఫైర్ స్టంట్ బెడిసికొట్టి అతడి ముఖం కాలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. కంటెంట్ క్రియేటర్లు కూడా పెరిగిపోయారు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలన్న పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా ఓ యువకుడు రీల్స్ కోసం అగ్గితో ఆటలాడాడు. ఫైర్ స్టంట్ బెడిసి కొట్టడంతో.. అతడి ముఖం కాలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే..
ఓ యువకుడు నోటి నిండా కిరోసిన్ నింపుకున్నాడు. లైటర్ ఆన్ చేసి నోట్లోని కిరోసిన్‌ను అగ్గి మీదకు ఊశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు వెంటనే అతడి ముఖానికి వ్యాపించాయి. ఆ యువకుడు భయపడిపోయి అటూ ఇటూ పరుగులు తీయటం మొదలెట్టాడు. అక్కడ ఉన్న జనం అతడికి సాయం చేయడానికి పూనుకున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే నోట్లో ఇంకా కొంచెం కిరోసిన్ ఉండటంతో మంటలు మరింత ఎక్కువ అయ్యాయి.
అతడు ప్రాణ భయంతో గట్టిగా కేకలు వేస్తూ పరుగులు తీయటం మొదలెట్టాడు. స్థానికులు అతి కష్టమ్మీద ఆ మంటల్ని ఆర్పేశారు. అప్పటికే అతడి ముఖం బాగా కాలిపోయింది. అక్కడివారు వెంటనే స్పందించి అతడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘రీల్స్ పిచ్చితో నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు’.. ‘తగిన శాస్తి జరిగింది. ఇకపై ఎవ్వరూ ఇలాంటి పిచ్చి పనులు చేయరు’.. ‘ఇలాంటి పిచ్చివాళ్లను ఏం చేసినా లాభం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..