బతికుండగానే అంత్యక్రియలు.. 7 వేల మందికి దినం భోజనం..
ABN , Publish Date - May 17 , 2026 | 08:38 PM
మధ్య ప్రదేశ్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు సరిగా చేస్తారో లేదో అన్న అనుమానంతో ఓ వ్యక్తి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన అంత్యక్రియలు తనే స్వయంగా నిర్వహించాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: మధ్య ప్రదేశ్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు సరిగా చేస్తారో లేదో అన్న అనుమానంతో ఓ వ్యక్తి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన అంత్యక్రియలు తనే స్వయంగా నిర్వహించాడు. అందరినీ పిలిచి దినం భోజనం పెట్టాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శివ్‌పురిలోని హజీనాఘర్ గ్రామానికి చెందిన కల్యాణ్ పాల్‌కు కొడుకు తప్ప ఎవ్వరూ లేరు. కుమారుడికి ఇంకా పెళ్లి అవ్వలేదు. కల్యాణ్ గత కొన్నేళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆయన గత కొంతకాలం నుంచి ఓ దిగులు పట్టుకుంది.
తను చనిపోతే సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి, దినం భోజనాలు పెట్టడానికి ఎవ్వరూ లేరని బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ వింత ఆలోచన వచ్చింది. తన అంత్యక్రియలు తానే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంత్యక్రియలకు రెండు రోజుల ముందు ప్రయాగ్‌రాజ్ వెళ్లాడు. అక్కడ తన పేరు మీద శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. గంగలో మునిగాడు. ఊరికి తిరిగి వచ్చిన తర్వాత 24 గంటల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాడు. శనివారం రోజున దినం భోజనం ఏర్పాటు చేశాడు.
ఈ కార్యక్రమానికి ఏకంగా 6 వేల నుంచి 7 వేల మంది వచ్చారు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే కాకుండా.. పొరుగు గ్రామాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ ఘటనపై కల్యాణ్ మాట్లాడుతూ.. ‘చావు ఎప్పుడు వచ్చినా.. సంతోషంగా ప్రాణాలు విడుస్తాను. చనిపోయిన తర్వాత నిర్వహించే కార్యక్రమాలు దగ్గరుండి చేయించుకున్నాను. అంత్యక్రియలను నా కళ్లతో చూసుకున్నాను’ అని అన్నాడు. కల్యాణ్ వింత పనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మాస్కోలో భారతీయ కార్మికుడి మృతి
యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి..