Share News

ఢిల్లీలో జాతీయ జెండాతో మహిళ వినూత్న నిరసన.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:04 PM

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కోల్‌కతాకు చెందిన అద్రితా రోష్ని నిశ్శబ్ద నిరసన అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజ్యాంగ పరిరక్షణ, నిష్పక్షపాత ఎన్నికలకు మద్దతుగా జాతీయ జెండాను పట్టుకుని ఐదు గంటలకు పైగా నిలబడ్డారు. ఆమె నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలో జాతీయ జెండాతో మహిళ వినూత్న నిరసన.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యాంగ పరిరక్షణ.. నిష్పక్షపాత ఎన్నికలకు మద్దతుగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కోల్‌కతాకు చెందిన అద్రితా రోష్ని వినూత్నంగా నిరసన తెలిపారు. అక్టోబర్ 12న నిరసన ప్రదర్శనల మధ్య చేతిలో జాతీయ జెండాను పట్టుకుని ఎలాంటి నినాదాలు చేయకుండా ఐదు గంటలకు పైగా ఆమె నిలబడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలన్నారు. స్వతంత్ర జర్నలిస్ట్ ఫాతిమా ఖాన్ రికార్డ్ చేసిన అద్రితా నిశ్శబ్ద నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు జాతీయ జెండాను పట్టుకుని నిలబడ్డానని ఆమె వెల్లడించారు.


తన చేతులు నొప్పిగా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు.. దేశంలో కుల, లింగ భేదాలు లేకుండా ప్రజలంతా బాధలు ఎదుర్కొంటున్నప్పుడు తన ఇబ్బందిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అద్రితా సమాధానమిచ్చారు. మహిళలు, జర్నలిస్టుల పట్ల ఇటీవల జరిగిన పరిణామాలు తనను నిరసనలో పాల్గొనేలా చేశాయని, రెండు రోజుల క్రితం ఓ న్యాయవాదితో పాటు తనను కూడా నిర్బంధించారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు.

నిరసన సమయంలో కొందరు అపరిచితులు తనకు నీళ్లు, ఆహారం కావాలా అని అడిగి చూపిన మానవత్వం భారతదేశ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని.. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములేనని చెప్పారు. సీజేపీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అద్రితా పట్టుదల.. నిశ్శబ్ద నిరసన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.


ఈ వార్తలూ చదవండి

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 14 , 2026 | 03:13 PM