కేరళంలో త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
ABN, Publish Date - Sep 11 , 2026 | 09:12 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు.
1/10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు.
2/10
ఇవాళ సాయంత్రం ఆలయంలో విశిష్ఠ సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు.
3/10
దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శంకు చక్రాలతోపాటు ధనస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు.
4/10
శ్రీరామస్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామికి పట్టువస్త్రాలను పవన్ కల్యాణ్ సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకు కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంత పద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5/10
ఆలయ మేల్ శాంతి (ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని పూజ అనంతరం పవన్‌కు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామస్వామి క్షేత్రానికి విచ్చేసిన పవన్‌కు కొచ్చిన దేవస్థానం బోర్డు చైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
6/10
తీర్వా నదిలో చేపలకు ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం శ్రీరామస్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుడిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు.
7/10
అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండటంతో, ఆ నదిలో చేపలకు ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్లుగా భక్తులు భావిస్తారు.
8/10
స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచా పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకీ లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచా పేలుడుతో బదులిచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.
9/10
దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న పవన్, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
10/10
త్రిప్రయార్‌లోని శ్రీరామస్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడితో పూజలందుకున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న పవన్ కల్యాణ్ శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
Updated at - Sep 11 , 2026 | 09:26 PM