అమెరికా 'తానా' ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు.. ఉత్సాహంగా హైకింగ్
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:31 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో 'ఫాదర్స్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ సేవలలో భాగంగా జూన్ 21న ఏర్పాటు చేసిన 'ఫాదర్స్ డే హైకింగ్' ఈవెంట్ ఉల్లాసంగా సాగింది.
ఛార్లెట్ (యూఎస్ఏ), జూన్ 22: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో 'ఫాదర్స్ డే' వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు సమాజాన్ని ఏకం చేస్తూ, కమ్యూనిటీ సేవలలో భాగంగా జూన్ 21న ఏర్పాటు చేసిన 'ఫాదర్స్ డే హైకింగ్' ఈవెంట్ విజయవంతంగా ముగిసింది.
మూడు తరాల కలయిక.. 60 మంది ఉత్సాహ భాగస్వామ్యం
ప్రకృతి ఒడిలో సాగిన ఈ ప్రత్యేక హైకింగ్ కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన సుమారు 60 మంది తెలుగువారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, నయనానందకరమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగిన ఈ హైకింగ్.. తండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది.

హైకింగ్ పూర్తియిన తర్వాత అందరికీ ప్రత్యేక అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కేక్ కటింగ్ వేడుక, కుటుంబాల మధ్య సాగిన స్నేహపూర్వక సంభాషణలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదొక మరపురాని మధురమైన వేడుకగా నిలిచిందని పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.
జీవిత మార్గదర్శి 'నాన్న'.. తానా ప్రతినిధులు
ఈ సందర్భంగా ఛార్లెట్‌లోని 'తానా' నాయకులు మాట్లాడుతూ.. తెలుగు కమ్యూనిటీ కోసం తానా నిరంతరం ఎన్నో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అందులో భాగంగానే ఈ ఫాదర్స్ డే ఈవెంట్‌ను తలపెట్టామని తెలిపారు.
'మన జీవితానికి దిక్సూచి, మార్గదర్శి నాన్న. అలాంటి నాన్నను గౌరవించుకుంటూ చేసిన ఈ వేడుకకు ఇంత అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. పరాయి దేశంలో ఉన్నా మన తెలుగువారి మధ్య ఐక్యతను, ఆత్మీయతను పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈ ఈవెంట్ ద్వారా ఇక్కడి కుటుంబాలు ఒకరినొకరు పరిచయం చేసుకునే మంచి అవకాశం లభించింది.' అని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకంగా సేవలందించిన స్వచ్ఛంద సేవకులకు (వలంటీర్లకు) తానా ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
విజయవంతం చేసిన కమిటీ సభ్యులు
ఈ వినూత్న కార్యక్రమ నిర్వహణ విజయవంతం కావడానికి నాని వడ్లమూడి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి, నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని, అన్నే రమణ తదితర తానా ప్రతినిధులు, సభ్యులు కృషి చేశారు.

Also Read:
ఏపీలో పిడుగుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..