లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:21 PM
లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియా ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు పలు దుకాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఐదుగురు నుంచి ఏడుగురు విద్యార్థులు భవనం నుంచి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎనిమిది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పలువురు విద్యార్థులు భవనంలో చిక్కుకుపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అగ్నిప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:
విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు