అమెరికాలో హిందూ ఆచారాలపై పిల్లలకు 'రిచువల్స్ అండ్ రీజన్' సదస్సులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:24 AM
హిందూ సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత, తాత్వికతను పిల్లలకు పరిచయం చేసేలా ఛార్లెట్, నార్త్ కరోలినాలో ఇటీవల ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: హిందూ సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత, తాత్వికతను పిల్లలకు పరిచయం చేసేలా ఛార్లెట్, నార్త్ కరోలినాలో ఇటీవల ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎన్ సి ఎస్ ఎస్ ఎమ్ (నార్త్ కరోలినా స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్) డర్హమ్‌లో సీనియర్‌గా చదువుతున్న రిషి జాస్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘రిచువల్స్ అండ్ రీజన’ (ఆచారం వెనుక ఉన్న కారణాలు) పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక సదస్సుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), శ్రీ సాయి గురుదేవ దత్త మందిర్ (హంటర్స్‌విల్, నార్త్ కరోలినా), గ్రేటర్ ఛార్లెట్ ప్రాంత తెలుగు సంఘం (TAGCA) సహకారం అందించాయి. అలాగే ఛార్లెట్‌కు చెందిన కొందరు వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌షిప్ అందించారు. హిందూ ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయ, తాత్విక కోణాలను హైస్కూల్ విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్స్‌హా, నార్త్ కరోలినాలోని చిమ్నీస్ ఆఫ్ మార్విన్ కమ్యూనిటీ సెంటర్‌లో ఈ సదస్సులు జరిగాయి. తొమ్మిది తరగతి నుంచి పై తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు ఆచార వ్యవహారాలను కేవలం సంప్రదాయాలుగా కాకుండా, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ, తాత్విక కారణాలను అర్థం చేసుకునేలా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. యువ కార్యక్రమంలో భాగంగా బోధించిన హిందూ తాత్విక సంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే ‘రీజన్ అండ్ రేషనాలిటీ’ అనే తత్వశాస్త్ర కార్యక్రమం నుంచి ప్రేరణ లభించింది.

ముగింపు రోజున పిల్లలు.. పెద్దలు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 75 మందికి పైగా పిల్లలు, పెద్దలు హాజరయ్యారు. ఫిలాసఫీ అండ్ రిలిజియన్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న సాగర్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని, విద్యార్థులతో పాటు అక్కడ ఉన్న పిల్లలు, పెద్దలతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా అందరూ తమకు సంబంధించిన సందేహాలను ఆయనతో చర్చించి, పలు అంశాలపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగా నిర్వహించబడింది. అనూహ్యమైన స్థాయిలో స్పందన లభించడంతో మొత్తం 30 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రిషి జాస్తి ఈ కార్యక్రమానికి ముందు నుంచే ప్రత్యేకంగా విరాళాలు సేకరించి, కమ్యూనిటీ కార్యక్రమం జరిగిన రోజున శ్రీ సాయి గురుదేవ దత్త మందిర్ (హంటర్స్‌విల్, నార్త్ కరోలినా)కు నిరుపేదలకు ఆహారం అందించే కార్యక్రమం కోసం 300 డాలర్లు అందించారు. ఈ మందిరం ప్రతి గురువారం 1000 మందికి పైగా భక్తులకు, నిరుపేదలకు మహాప్రసాదం అందిస్తోంది. 'హిందూ సంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేసి, ప్రశ్నించి, నేర్చుకోవాలనుకునే యువతకు ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన అవకాశంగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు రిషి జాస్తి తెలిపారు.