Share News

బహ్రెయిన్‌లో పులకించిన టీకేఎస్ సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:58 PM

బహ్రెయిన్‌లో టీకేఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.

బహ్రెయిన్‌లో పులకించిన టీకేఎస్ సంక్రాంతి సంబరాలు
Bahrain Sankranti celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండగైన సంక్రాంతి సంబరాలు గోదావరి తీరానికి ముందస్తుగా వచ్చినా అరేబియా సముద్ర తీరానికి ఆలస్యంగా వచ్చినా కోనసీమ తరహాలోనే గల్ఫ్ ఎన్నారైలను పులకింపజేసింది.

బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు కళా సమితి (టీకేఎస్) ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అసలైన జానపద ఆటపాటలతో అంబరాన్నంటాయి. ఎడారి నాట సంక్రాంతి సంబరాలతో గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసీయులు అందరిలో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు.

తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు, సంక్రాంతి విశిష్ఠతను వివరించే కళారీతులు ఎండిన ఆకులలో కూడా అలజడి చేయించే తెలంగాణ జానపద గేయాలకు ఎన్నారైలు పరవశించిపోయారు. సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పే సామూహిక భోగి పళ్ళ వేడుక, ముత్యాల ముగ్గులు, బొమ్మల కొలువులు, పిండి వంటల ఘుమఘుమలతో ఆనందోత్సహాల మధ్య సంక్రాంతిని వైభవంగా నిర్వహించుకున్నారు.

2.jpg


సామాజిక మాధ్యమాలలో తెగ సంచలనం సృష్టించిన రాను బొంబాయికి రాను అనే జానపద పాటను రాము రాథోడ్ ప్రత్యేకంగా బహ్రెయిన్‌కు వచ్చి పాడి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఈ సందర్భంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు పి. జగదీష్ మాట్లాడుతూ, తెలుగు భాష, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం తెలుగు కళా సమితి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పల్లా, కోశాధికారి నాగ శ్రీనివాస్, ఉప కార్యదర్శి లత, సభ్యత్వ కార్యదర్శి గంగా సాయి, సాంస్కృతిక కార్యదర్శి సంతోష్, క్రీడల కార్యదర్శి చంద్రబాబు, సాంకేతిక విభాగాధిపతి శ్రీ దీపక్ తదితరులు వేడుకలను సమన్వయం చేశారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు సుబ్రహ్మణ్యం, జేవీఆర్ మూర్తి, రఘునాథ బాబు, మోహన్ మురళీధర్, హరి బాబు, శివ, మురళీకృష్ణ, యుగంధర్, వీఎంఆర్ శర్మ, వందన, వినయ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

3.jpg


గాయకులు అరుణ అంకరావు, గంగా సాయి, వ్యాఖ్యాతలు లక్ష్మీ కుమారి, సత్య ప్రసూన, నృత్య దర్శకులు స్వాతి యేలూరి, మౌనిక కిరణ్, కావ్య, సింధూజ, రేవతి, హారిక, స్వాతి, లత తదితరుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్పాన్సర్లు, నిర్వాహక బృందం, టికెట్ అండ్ ఫుడ్ సర్గింగ్ కమిటీలు, సాంకేతిక బృందం, అల్ అహ్లి క్లబ్ యాజమాన్యం, సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు తెలుగు కళా సమితి కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.

4.jpg


ఇవీ చదవండి:

అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం

బడ్జెట్‌ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!

Updated Date - Feb 04 , 2026 | 07:17 PM