అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:17 PM
సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది. విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల ఆరోగ్య భద్రతపై ఆమె ప్రసంగించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అరబ్బు దేశంలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొని కీలకమైన అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అరుదై అవకాశం ఒక ఆంధ్ర వనితకు దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి చర్చించడానికి ప్రపంచ కార్మిక మార్కెట్ సదస్సు (జి.యల్.యం.సి) తాజాగా జరిగింది. ఈ సదస్సులో వందకు పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సౌదీ అరేబియా మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర్‌కు చెందిన చేతన జగదేశ్వరికి కూడా ఈ సదస్సులో ఓ ముఖ్య అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది.
సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐరోపా యూనియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో, సరైన వసతులు, వెలుతురు, గాలి లేకుండా నివసించే కార్మికుల పరిరక్షణలో సామాజిక బాధ్యత అనే అంశంపై ఈ సదస్సులో జరిగిన చర్చలో తాను ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడానని చేతన తెలిపారు.
కార్మికులు తమ ఉపాధి దేశం నుండి మాతృదేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా సరిహద్దులకు అతీతంగా కృషి జరగాలని చేతన సూచించారు. అధిక ఉష్ణోగ్రత నుండి కార్మికులను కాపాడే దిశగా ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వం వేసవి కాలంలో బయట ఎండలో పని చేయడాన్ని నిషేధించిందని అన్నారు. తద్వారా ఈ దిశగా పురోగతి సాధిస్తున్నందుకు సౌదీ అరేబియాకు కృతజ్ఞతలు తెలిపారు.
సౌదీ అరేబియాలో క్రియాశీలక తెలుగు మహిళలలో ఒకరైన చేతన చాలా కాలంగా కుటుంబ సమేతంగా అక్కడే నివసిస్తున్నారు. వివిధ సమస్యలపై స్పందించే ఆమె సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల సంస్థ సాటా సెంట్రల్‌లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చేతన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నందుకు సాటా సెంట్రల్ అభినందించింది.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!
తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఆహార దాన కార్యక్రమం