బడ్జెట్ 2026.. ఎన్నారైల విషయంలో ఇప్పటికీ లైసెన్స్ రాజ్ వైఖరే!
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:17 PM
భరతమాత ముద్దు బిడ్డలు అయినా ప్రతిసారీ బడ్జెట్ వడ్డింపులలో మాత్రం ప్రవాసీయుల పట్ల భారతదేశం ఇంకా గతించిన లైసెన్స్ రాజ్ వైఖరిని ప్రదర్శిస్తోంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఆర్థికాభివృద్ధితో విశ్వగురువుగా వెలుగుతున్న భారత్‌లో ప్రవాసీయులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు. భరతమాత ముద్దు బిడ్డలు అయినా ప్రతిసారీ బడ్జెట్ వడ్డింపులలో మాత్రం ప్రవాసీయుల పట్ల భారతదేశం ఇంకా గతించిన లైసెన్స్ రాజ్ వైఖరిని ప్రదర్శిస్తోంది. వాస్తవానికి ప్రతి బడ్జెటులో ప్రవాసీయులకు.. ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో నివసించే ప్రవాసీయులకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమీ లేదు. బడ్జెట్ కేటాయింపులను అర్థం చేసుకోవడం ప్రవాసీయులకు ఒక మిథ్యగా ఉంది. దైనందిన ప్రవాసీయుల జీవితాలతో సంబంధం లేని విషయాలను పరస్పరం సామాజిక మాధ్యమాలలో పంచుకోవడం మినహా దానిపై విశ్లేషణ చేసే అవగాహన కొరవడింది.
గల్ఫ్ దేశాలలో ఉండే సామాన్య ప్రవాసీ లోకానికి బడ్జెట్‌లో పర్సనల్ బ్యాగేజీ అనేది ముఖ్యం. కానీ దాని గురించి ఆశించిన విధంగా చర్చ జరగడం లేదు. ప్రవాసీయులు సంవత్సరం తర్వాత తాము స్వదేశానికి వెళ్తున్నప్పుడు తమ వెంట తీసుకెళ్లే వస్తువుల పై సుంకాల పరిధి, పరిమితి గురించి తెలుసుకోవాలి. ఈ రకంగా తీసుకెళ్లే వస్తువులు పర్సనల్ బ్యాగేజీ పరిధిలోకి వస్తాయి. ఒక దశాబ్దకాలం తర్వాత దీన్ని సవరించారు. 2016లో రూపొందించిన నిబంధనల ప్రకారం 50 వేల రూపాయాలుగా ఉన్న ఈ పరిమితిని 2026లో 75 వేల రూపాయాలకు పెంచారు.
2026 బడ్జెట్‌లో పర్సనల్ బ్యాగేజీ నిబంధనల కింద ఈ పరిమితిని 75 వేల రూపాయాల వరకూ పెంచడం సంతోషమే. అయితే, 2016లో 50 వేలు పరిమితి విధించినప్పుడు డాలర్ మారకం విలువ 67 రూపాయలు. నాటి పరిస్థితులకు అది సమంజసమే. కానీ, 2026లో డాలర్ మారకం దాదాపుగా 91.50 ఉండగా పరిమితిని కేవలం రూ. 75 వేలకే పెంచారు. పైగా విదేశాలలో ఉంటున్న భారతీయులు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారు. సగటు మనిషి తన వెంట ఒక తాజా మోడల్ ఐ ఫోన్ లేదా రెండు, మూడు తులాల బంగారం గొలుసు లేదా ఇతరత్రా ఖరీదైన వస్తువులను తీసుకెళ్ళడం ఇప్పుడు మాములు విషయం. ఇది తాజా 75 వేల పరిమితి దాటిపోతోంది.
డిజిటల్ యుగానికి తగినట్లుగా నూతన లాప్ టాప్ లేదా నోట్‌బుక్‌ను సుంకం లేకుండా అనుమతించడం ముదావహం. బంగారు ఆభరణాలు తీసుకువచ్చే విషయమై 2016 నుండి అమలులో ఉన్న నిబంధనలను దశాబ్ద కాలంగా ఏ రకమైన మార్పు లేకుండా కొనసాగిస్తున్నారు. 2026 బడ్జెటులో కూడా బంగారు ఆభరణాలను తీసుకువచ్చే విషయమై ఏ రకమైన సవరణలు చేయలేదు. మహిళలు అయితే నలభై గ్రాములు, పురుషులకు ఇరవై గ్రాముల బంగారు ఆభరణాలు వెంట తీసుకురావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముడి బంగారం అంటే నాణేలు, బంగారం బిస్కట్లను తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు.
విదేశాలలో మూడు సంవత్సరాలకు పైగా ఉండి శాశ్వతంగా స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయులు తాము ప్రవాసంలో వినియోగించుకున్న గృహోపకరణ వస్తువులను తీసుకోరావడంలో కూడా కేంద్రం ప్రవాసీయులపై కనికరించింది. టి.ఆర్. కింద తీసుకువచ్చే గృహోపకరణ వస్తువులపై ఏడు లక్షల యాబై వేల రూపాయాల వరకూ మినహాయింపు ఇచ్చింది. గతంలో దీని పరిమితి అయిదు లక్షల రూపాయలు ఉండేది. వికసిత్ భారత్‌కు తిరిగి వెళ్లే భరతమాత ముద్దు బిడ్డలకు ఈ పెంపు పెద్ద ఊరట అని భారతీయ జనతా పార్టీ అభిమాని, దుబాయిలోని ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలుగు విభాగం అధ్యక్షుడు కుంబాల మహేంద్ర రెడ్డి వ్యాఖ్యానించారు.
విదేశీ వలసలు, ప్రయాణాలను ప్రొత్సహిస్తున్న కేంద్రం దానికి తగినట్లుగా పాస్‌పోర్టుల జారీని సరళీకృతం, వేగవంతంగా చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. 2026-27 బడ్జెట్‌లో పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ కోసం రూ. 2,435 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇది రూ.435 కోట్లు అధికం. చిప్ అమర్చి ఉండే ఈ-పాస్ పోర్టుల జారీ కోసం కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. అదే విధంగా, విదేశాలలో.. ప్రత్యేకించి గల్ఫ్ దేశాల నుండి యాజమానుల ద్వారా ఉద్యోగ హామీ, ఒప్పంద పత్రాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ-గేట్ ద్వారా అమలు చేయడానికి ఈ నిధులను వెచ్చిస్తారు. ఉద్యోగాల విషయంలో మోసపోతున్న భారతీయ యువకులను చట్టబద్ధంగా విదేశాలకు పంపడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించడానికి ఈ విధానం దోహాదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలను సమర్ధించే సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు రంజీత్ చిట్లూరి అభిప్రాయపడ్డారు.
ఇక ప్రవాసీయుల సంక్షేమానికి వచ్చేసరికి, గల్ఫ్ దేశాలలో కష్టాలలో ఉన్న భారతీయ మహిళలకు సహాయం అందించడానికి నిర్భయ నిధి కింద ఈసారి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. సహాయ కేంద్రాలను నెలకొల్పుతామన్న కేంద్రం దాన్ని విస్మరించింది. వాస్తవానికి ఈ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందే వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు. ఇళ్లల్లో పని చేయడానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కునే వారు, భర్తల చేతిలో గృహహింస ఎదుర్కునే వారి కొసం ఉద్దేశించిన ఈ పథకం గురించి గల్ఫ్‌లో నాయకులమంటూ చెప్పుకునే ఎవరికీ కనీస పరిజ్ఞానం కూడా లేదనిపిస్తుంది.
మహిళల సహాయార్థం వన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలను నెలకొల్పడానికి 5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ కేటాయింపు ఒక్క గల్ఫ్ దేశంలో కూడా సరిపోవు. గతంలో కూడా ఈ నిధులను ఖర్చు చేయలేదు.
ఇవీ చదవండి:
తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఆహార దాన కార్యక్రమం
అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన గల్ఫ్ తెలుగుదేశం నాయకులు