లండన్‌లో జరిగిన డబ్ల్యూటీఎం 2026లో.. ఏపీ పర్యాటక శాఖకు ప్రత్యేక గుర్తింపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:38 PM
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదర్శన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక గుర్తింపు పొందింది. లండన్‌లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలో ఇన్క్రెడిబుల్ ఇండియా బృందంలో భాగంగా ఏపీ ప్రతినిధి బృందం పాల్గొని రాష్ట్ర పర్యాటక విశేషాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదర్శన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) 2026లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక గుర్తింపు పొందింది. లండన్‌లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలో ఇన్క్రెడిబుల్ ఇండియా బృందంలో భాగంగా ఏపీ ప్రతినిధి బృందం పాల్గొని రాష్ట్ర పర్యాటక విశేషాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి జైకుమార్ గుంటుపల్లి, ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్లు వినోద్ మాదాల, పవిత్ర గుడిపాటి, రత్నశ్రీ ఉప్పల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన రాష్ట్ర పర్యాటక విశేషాలను, ప్రత్యేక ఆకర్షణలను ఆసక్తిగా పరిశీలించారు. ఏపీ పర్యాటక శాఖ చేపట్టిన ప్రదర్శనను అభినందిస్తూ ప్రశంసలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర పర్యాటక సంపదను పరిచయం చేయడం ద్వారా ఏపీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడింది.

డబ్ల్యూటీఎం 2026 ప్రదర్శనను రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కీలక వేదికగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ పర్యాటక సంస్థలు, ప్రతినిధులు, పర్యాటక రంగ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్‌లోని సందర్శనీయ ప్రాంతాలను పరిచయం చేసే అవకాశం లభించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం, ప్రకృతి పర్యాటకం, వారసత్వ పర్యాటకానికి ఉన్న ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడంపై దృష్టి సారించారు. విదేశీ పర్యాటకుల రాకను పెంచడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక రంగంలో రాష్ట్ర స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని ప్రతినిధి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో డబ్ల్యూటీఎం 2026 భాగస్వామ్యం కీలకంగా నిలిచింది.

