Share News

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 08:09 PM

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అమెరికా రాజధానిలో.. GWTCS ఆధ్వర్యంలో ఘనంగా 80వ భారత స్వాతంత్య్ర వేడుకలు

వాషింగ్టన్ డీసీ: బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి, కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

nri1.jpg


త్యాగధనుల స్ఫూర్తితో దేశ ప్రగతికి పునరంకితం కావాలి

GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ, ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మహాత్మా గాంధీజీతో పాటు స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవితాలు మనందరికీ ఆదర్శమన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న స్వేచ్ఛను నేడు అనుభవిస్తున్న మనం, భారతదేశ అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు మరింతగా పునరంకితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ, భారతీయులుగా మన ఐక్యతను, సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

nri2.jpg


మాతృభూమి, మాతృభాష పరిరక్షణ మన బాధ్యత

GWTCS కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ, 80 ఏళ్ల స్వతంత్ర భారతం మహనీయుల కలల సాకారం, అసంఖ్యాక వీరుల త్యాగఫలమన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు, అహింసావాదుల త్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతమని పేర్కొన్నారు. “దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్నా… వొట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేల్ తలపెట్టవోయి” అంటూ మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, దేశభక్తి మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ ప్రతిబింబించాలని అన్నారు.

nri3.jpg


ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా మాతృభూమి, మాతృభాష, భారతీయ సంస్కృతి పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతే దేశానికి బలం, భవిష్యత్తు అని పేర్కొంటూ, జాతీయ సమైక్యత, సహోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. కార్యక్రమం అనంతరం భారత రాయబార కార్యాలయంలో, రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను ఉప్పుటూరి రామ్ చౌదరి, భానుప్రకాష్ మాగులూరి, తదితర ప్రవాస పెద్దలు కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

nri4.jpg


ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, చంద్రనాధ్ నంబూరు, వల్లభనేని వీరభద్రరావు, కందుల అభిరామ్, చింతా రాంబాబు, శ్రీకాకుల రామ సత్యనారాయణ, అన్నం పూర్ణచంద్రరావు, రాధాకృష్ణ మైనేని, ఐతా భిక్షపతి, సూరేపల్లి బ్రహ్మం, సి.హెచ్. సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, జంపాల కృష్ణ మోహన్, డాక్టర్ అల్లం లింగం, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, చెరుకూరి ఇందుశేఖర్, పి. నర్సింగరావు, యాదగిరి గుండా తదితరులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల ఐక్యత, దేశభక్తి, భారతీయ సంస్కృతి పట్ల వారి నిబద్ధతకు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.

Updated Date - Aug 16 , 2026 | 08:16 PM