Share News

సవాళ్ల బాటలో సవారీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:56 AM

స్వీయాన్వేషణ కోసం కొందరు విహారయాత్రలను ఎంచుకుంటే... మరికొందరు తీర్థయాత్రలు చేపడతారు. కానీ ఎంతో అరుదుగా కొందరు మహిళలు మాత్రమే మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ను...

సవాళ్ల బాటలో సవారీ

స్వీయాన్వేషణ కోసం కొందరు విహారయాత్రలను ఎంచుకుంటే... మరికొందరు తీర్థయాత్రలు చేపడతారు. కానీ ఎంతో అరుదుగా కొందరు మహిళలు మాత్రమే మోటార్‌ సైకిల్‌ రైడింగ్‌ను ఎంచుకుంటూ ఉంటారు.

అలాంటి ఇద్దరు లేడీ రైడర్స్‌ కథ ఇది.

నిశ్శబ్దం రాజ్యమేలే ఎత్తైన హిమాలయా రహదారుల మీద, ఇసుక తుఫాన్లు చెలరేగే రాజస్థాన్‌ ఎడారి దారుల మీద, మోటార్‌సైకిల్‌ ప్రయాణాలు కేవలం పురుషులకే పరిమితం కాదని నిరూపిస్తున్నారు హుబ్లికి చెందిన కాండిడా లూయిస్‌, థానెకు చెందిన దర్శన ససానె. హుబ్లిలో పుట్టి పెరిగిన కాండిడా, దైనందిన జీవితంలో మోటర్‌సైకిల్‌ ఒక భాగమైపోయింది. చిన్నప్పుడు నాన్న నడిపే మోటర్‌సైకిల్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ మీద కూర్చుని, రెండు చేతులతో హ్యాండిల్‌ బార్‌ పట్టుకున్నప్పుడే ఆమెలో రైడర్‌ బీజాలు పడిపోయాయి. చిన్నప్పటి ఆ బైక్‌ ప్రయాణాలు ఆమె భవిష్యత్తుకు ఒక రూపాన్నిచ్చాయి. మోటర్‌సైకిల్స్‌ను స్వేచ్ఛకు ప్రతిరూపాల్లా భావించే కాండిడా, ఓ పక్క చదువుకుంటూనే, ఖాళీ సమయాల్లో రైడింగ్‌ అభిరుచిని కొనసాగించింది. బెంగుళూరుకు వచ్చేసి, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేసింది. అయితే స్థిరమైన ఉద్యోగమేదీ ఆమెను ఆకట్టుకోలేకపోయింది. నగరం దాటి విస్తరించిన రోడ్లు, అందమైన ప్రకృతిదృశ్యాలు ఆమెను కుదురుగా కూర్చోబెట్టలేకపోయాయి. అలా 2015లో మొదటిసారి 3 నెలల పాటు మోటర్‌సైకిల్‌ మీద భారతదేశమంతా చుట్టబెట్టిన కాండిడా, ఆ తర్వాత తన బైక్‌ రైడింగ్‌ అభిరుచిని విదేశాలకు విస్తరించింది. ఇప్పటివరకూ ఆమె తన బజాజ్‌ డామినార్‌ 400 సిసి బైక్‌ మీద ఏకంగా 40 దేశాలు చుట్టేసింది.


భయం స్థానంలో ఆత్మవిశ్వాసం...

‘‘పర్వత మార్గంలోకి ప్రవేశించగానే మారిపోయే ఉష్ణోగ్రతలు, అడవుల సువాసనలు, సముద్రపు గాలులు, మట్టి వాసనలు.. ఇలా ప్రయాణాల్లో పొందే ఆహ్లాదకరమైన అనుభూతులకు కొదవ ఉండదు. నచ్చిన చోట ఆగుతూ, ప్రజలతో మాట్లాడుతూ, కొత్త సంగతులు తెలుసుకుంటూ ప్రయాణించడంలో అంతులేని సంతృప్తిని పొందగలుగుతాం! చంద్రుడి ఉపరితలాన్ని తలపించే స్పితి లోయలోకి అడుగుపెట్టినప్పుడు, జీవితంలో మర్చిపోలేని అనుభూతికి లోనయ్యాను. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నిరాదరణ పొందుతున్న బైక్‌ రైడింగ్‌ గమ్యస్థానాల్లో ఆస్ట్రేలియా ఒకటి. నిజానికి బైక్‌ రైడింగ్‌కు అనువైన గొప్ప దేశాల్లో అదొకటి. ఇక ఐర్లాండ్‌ అందాల గురించి మాటల్లో చెప్పలేను. నాకెంతో ఇష్టమైన దేశమది. అక్కడి తీర రహదారులు, అకస్మాత్తుగా తడిపేసే వర్షాలు, నాటకీయమైన కొండకొనలు, నా ప్రతి ప్రయాణాన్నీ అద్భుతంగా మలిచేశాయి. మొదటి ప్రయాణం కచ్చితంగా భయానికి గురి చేస్తుంది. ఆందోళన, అనుమానాలకు లోను చేస్తుంది. కానీ ఆ తర్వాతే అసలైన ఆనందం దాగి ఉంటుంది. ఒకసారి ఒంటరి ప్రయాణానికి పూనుకున్న తర్వాత, అర్థంలేని భయాలన్నీ పక్కకు తప్పుకుని, అంతులేనంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’’ అంటూ పలు సందర్భాల్లో తన రైడింగ్‌ అనుభవాల గురించి చెప్పుకొస్తోంది కాండిడా.

2-Navya.jpg

స్టంట్‌ రైడర్‌గా...

కాండిడా సుదీర్ఘ ప్రయాణాలను ఎంచుకుంటే, థానెకు చెందిన దర్శన సుసానె వేగాన్ని ఎంచుకుంది. 22 ఏళ్ల సుసానె ఇప్పటికే భారతీయ మోటార్‌స్పోర్ట్స్‌లో తనదైన ప్రతిభను చాటుకుంది. 2014లో, ముందు బ్రేక్స్‌ను ఉపయోగించకుండా వలయాకారపు బురద రోడ్డులో మోటర్‌సైకిల్‌ను నడిపే, ఫ్లాట్‌ ట్రాక్‌ రేసింగ్‌లో గెలిచి, ఇండియాస్‌ ఫాస్టెస్ట్‌ ఉమన్‌గా పేరు తెచ్చుకుంది. అంతకు ముందు, ఆమెకు రేసింగ్‌ సర్క్యూట్స్‌లో అనుభవం లేదు. ఆమెకు ఆమె తల్లే తొలి ప్రేరణ. మోటర్‌సైకిల్‌ నడిపే తల్లి నుంచి ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్న సుసానె, బైక్‌ రైడింగ్‌నే అభిరుచిగా ఎంచుకుంది. ఏళ్ల తరబడి పలు మలుపులు తిరిగిన బైక్‌ జర్నీ చివరకు ఆమెను ప్రొఫెషనల్‌ స్టంట్‌ రైడర్‌ గమ్యానికి చేర్చింది. ప్రస్తుతం సుసానె, సినిమాల్లో స్టంట్‌ రైడర్‌గా పని చేస్తోంది. జులై 3న విడుదల కాబోయే ఆల్ఫా సినిమాలో అలియా భట్‌కు స్టంట్‌ రైడర్‌గా పని చేసిందామె.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:03 AM